శాఫ్ గేమ్స్ పతక విజేతలకు కేంద్రం నజరానా

  • స్వర్ణవిజేతలకు లక్షన్నర రూపాయలు

నేపాల్ రాజధాని ఖాట్మండూ వేదికగా ముగిసిన 13వ దక్షిణాసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు నగదు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

పదిరోజులపాటు జరిగిన ఈ క్రీడల్లో 312 పతకాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 174 స్వర్ణ, 93 రజత, 45 కాంస్యాలతో భారత్ వరుసగా 13వసారి ఓవరాల్ విజేతగా నిలిచింది.

బంగారు పతకాలు సాధించిన మొత్తం 174 మంది అథ్లెట్లకు లక్షన్నర రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర క్రీడాశాఖమంత్రి కిరణ్ రిజ్జూ ఢిల్లీలో ప్రకటిచారు.

రజత పతక విజేతలకు లక్షరూపాయలు, కాంస్య విజేతలకు 50 వేల రూపాయలు చొప్పున అందచేస్తారు.

అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి పతకాలు సాధించిన అథ్లెట్లు, క్రీడాకారులు స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే నిబంధనల ప్రకారం నగదు బహుమతులు అందచేసే విధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోంది.