మీరు ఏం రాసినా చూస్తూ కూర్చోవాలా?

తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలపై చర్యల కోసం తీసుకొచ్చిన జీవో 2430ని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో టీడీపీ పట్టుపట్టడంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీవో నెం 2430ను రద్దు చేయాలని చంద్రబాబు కోరడం విచిత్రంగా ఉందన్నారు. అసలు జీవోను చంద్రబాబు చదువుకుంటే మంచిదన్నారు. ఇంగ్లీష్ రాని వారికి తప్పించి ఎవరికైనా సరే ఈ జీవోలో ఎలాంటి తప్పు లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. పనిగట్టుకుని తప్పుడు కథనాలు, పరువుకు నష్టం కలిగించేలా చెడు ఉద్దేశంతో వార్తలు రాస్తుంటే ప్రభుత్వం, అధికారులు మౌనంగా వాటిని భరించాలా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

తప్పుడు కథనాలు రాస్తుంటే ప్రభుత్వానికి, అధికారులకు వాటిని ఎదుర్కొనే హక్కు ఎందుకు ఉండదని జగన్ ప్రశ్నించారు. తప్పురాసినా, ఏ రకంగా అన్యాయంగా టీవీల్లో చూపించినా, జరగనిది జరిగినట్టు చూపించినా… అందరూ మౌనంగా ఉండాల్సిందేనా అని ప్రశ్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వారు చంద్రబాబుకు సన్నిహితులు కాబట్టి ప్రభుత్వం మౌనంగా ఉండాల్సిందేనా.. న్యాయం అంటూ ఒకటి ఉండదా అని ముఖ్యమంత్రి నిలదీశారు.

చంద్రబాబు కనీస ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారన్నది ఈ అంశంతో స్పష్టంగా అర్థమవుతోందన్నారు.