వైఎస్ ఉన్నంత కాలం హద్దుల్లో ఉన్నారు…. ఆ తర్వాత టీడీపీ సభ్యుల ఆగడాల వల్ల బాత్‌రూముల్లో దాక్కున్నాం….

టీడీపీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే అసెంబ్లీలో మార్షల్స్‌పై దాడులు చేయడం సర్వసాధారణంగా జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే టి. ఆర్ధర్ వ్యాఖ్యానించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చీఫ్ మార్షల్ గా పనిచేసిన ఆర్థర్ తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఒక రూల్ బుక్‌ ఉంటుందని… దాని ప్రకారమే ఎవరైనా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. అసెంబ్లీలో గుంపుగా రావడం రూల్స్‌కు వ్యతిరేకమని వివరించారు.

చీఫ్ మార్షల్స్ అంటే బంట్రోతులు కాదని… ఒక డీఎస్సీ స్థాయి అధికారి అన్న విషయం టీడీపీ వారు గుర్తించుకోవాలన్నారు. చీఫ్ మార్షల్స్ వ్యవస్థనే కించపరిచేలా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించడం దారుణమన్నారు.

తాను వైఎస్ హయాంలో చీఫ్ మార్షల్స్‌గా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు టీడీపీ సభ్యులు హద్దుల్లోనే ఉండేవారని… వైఎస్‌ చనిపోయిన తర్వాత టీడీపీ సభ్యులు ఆగడాలు మితిమీరి పోయారని గుర్తు చేశారు.

లాబీల్లో అల్లరి చేయడం, గదుల్లోకి వెళ్లి లాక్‌ చేసుకోవడం, రాత్రంతా మార్షల్స్ జాగారం చేసేలా చేయడం వంటివి టీడీపీ వారు చేసేవారన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఎమ్మెల్యేల ఆగడాలు భరించలేక బాత్‌రూముల్లో దాక్కునే వారిమని ఆర్థర్‌ వివరించారు.

టీడీపీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా మార్షల్స్‌పై దాడి చేయడం, అసెంబ్లీ లాబీల్లో అల్లరి చేయడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉందన్నారు. ఇప్పుడూ అదే జరిగిందన్నారు. టీడీపీ నేతలు మరోసారి ఇలా చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆర్ధర్ కోరారు.