అయ్యన్న ఇంట్లో వివాదం

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి సోదరుల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరారు. ప్రస్తుతం అయ్యన్న, సన్యాసి పాత్రుడు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. వైసీపీలో చేరిన సన్యాసిపాత్రుడు తన ఇంటిపై వైసీపీ జెండా కట్టేందుకు ప్రయత్నించడంతో వివాదం చెలరేగింది.

అయ్యన్న, సన్యాసిపాత్రుడి మధ్య గొడవ జరిగింది. వారి అనుచరులు కూడా గొడవపడ్డారు. ఇంటిపై సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్‌ జెండా కడుతుండగా వరుసకు చిన నాన్నమ్మ అయిన లక్ష్మి, మరో బంధువు హర్ష వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో వాగ్వాదం జరిగింది.

ఈ ఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్, మరో బంధువు హర్ష వల్ల తనకు ప్రాణహాని ఉందని వరుణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వరుణ్‌ తనపై దాడి చేశారంటూ లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంట్లో గొడవ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద కాపలా ఉన్న పోలీసులపై అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు.

‘తమాషాగా ఉందా.. మేం కొడితే ఏమిచేస్తావు నీవు.. మర్యాదగా వెళ్లిపొండి..పద్ధతి గల మనుషులము మేము..మా ఇంటికి వచ్చేటప్పుడు అనుమతి లేకుండా రాకూడదు..ఎవరిచ్చారు నీకు అనుమతి?’ అంటూ పోలీసులపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తిట్లదండకం అందుకున్నారు.