నారా లోకేష్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోండి…

మార్షల్స్‌పై దాడి చేసిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి పేర్నినాని స్పీకర్‌ను కోరారు. నిన్న సభలోకి వస్తున్న సమయంలో టీడీపీ నేతలు మార్షల్స్‌ను కొట్టారని వివరించారు.

నేరప్రవృత్తి ఉన్న వ్యక్తుల తరహాలో టీడీపీ సభ్యులు ప్రవర్తించారని ఆరోపించారు. మార్షల్స్‌పై నారా లోకేష్ చేయి చేసుకున్న దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను పేర్నినాని అసెంబ్లీలో చూపించారు.

50, 60 మంది ఒకేసారి సమూహంగా వస్తుండడంతో అసెంబ్లీ భద్రతా సిబ్బంది గేటు మూసి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పరిశీలించి లోనికి పంపారన్నారు. ఆ సమయంలో టీడీపీ సభ్యులు భద్రతా సిబ్బందిని ”ఎవడురా వాడు, రాస్కెల్స్, ఇడియట్స్‌, యూస్ లెస్‌ ఫెలో” అంటూ పలు పదాలతో దూషించారని నాని వివరించారు.

ఆ పార్టీ అధ్యక్షుడే సంస్కారం వదిలేసి మాట్లాడుతుండడంతో… టీడీపీ సభ్యులు కూడా అదే తరహాలో మాట్లాడారన్నారు. అధికారులపై చేయి చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌లు భద్రతా సిబ్బందిపై చేయి చేసుకున్నారని పేర్నినాని వివరించారు. నారా లోకేష్ రెండుసార్లు మార్షల్స్‌ను కొట్టేందుకు వెళ్లారని పేర్నినాని చెప్పారు.

మార్షల్స్‌ను గోళ్లతో రక్కారని ఫోటోలను చూపించారు. నారా లోకేష్‌ చర్యలు ఎలా ఉన్నాయో చూడాలని స్పీకర్‌ను కోరారు. భద్రతా సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాడి చేసిన వీడియోలను ప్రదర్శించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.