సింధు కథ షరా మామూలే…

  • ప్రపంచ టూర్ ఫైనల్స్ లో వరుసగా రెండో ఓటమి

ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్లో విశ్వవిజేత సింధు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. వేదికలు, టోర్నీలు మారినా సింధు గెలుపుబాట పట్టలేకపోతోంది.

చైనాలోని గాంగ్జావో వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ టూర్ ఫైనల్స్ టోర్నీ గ్రూప్ లీగ్ నుంచే నిష్క్ర్రమించే ప్రమాదంలో సింధు చిక్కుకొంది.

ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్లో మొదటి ఎనిమిది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ల నడుమ రెండుగ్రూపులుగా సాగుతున్న ఈ టూర్ ఫైనల్స్ గ్రూప్- ఏ పోరులో.. జపాన్ ప్లేయర్ అకానే యమగుచి చేతిలో పరాజయం పొందిన సింధుకు …గ్రూప్ రెండోరౌండ్ పోటీలోనూ ఓటమి తప్పలేదు.

చైనా ప్లేయర్ చెన్ యూఫేతో జరిగిన మూడు గేమ్ ల సమరంలో సింధు 22-20, 16-21, 12- 21 తో పరాజయం పాలయ్యింది. వరుసగా రెండు సార్లు ఓడిన సింధు గ్రూప్ లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ తాయ్ జు యింగ్ గ్రూప్- బీ లీగ్ లో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సెమీస్ కు అర్హత సంపాదించింది. తాయ్ జు 11-21, 21-18, 21-16తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ ఇంటానన్ ను అధిగమించింది.

పురుషుల సింగిల్స్ లో డెన్మార్క్ స్టార్ ప్లేయర్ విక్టర్ యాక్సెల్ సన్ వరుసగా రెండో ఓటమితో సెమీస్ బెర్త్ అవకాశాలను క్లిష్టం చేసుకొన్నాడు.