అసెంబ్లీలోకి వచ్చిన టీడీపీ కార్యకర్తలపై క్రిమినల్ కేసులకు స్పీకర్ ఆదేశం

ముఖ్యమంత్రి, మార్షల్స్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు సీనియర్ నాయకుడిగా, మూడు సార్లు సీఎంగా చేసిన వ్యక్తిగా హుందాగా క్షమాపణలు చెప్పి చంద్రబాబునాయుడు ఆదర్శంగా నిలవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు.

మాటల్లో అనుచిత పదాలు ఉన్నట్టుగా స్పష్టంగా వీడియోల్లో రికార్డు అయినందున క్షమాపణ చెబితే హుందాగా ఉంటుందని సూచించారు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే సభ విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

నిన్న మార్షల్స్‌పై దాడి జరిగిన సమయంలో టీడీపీ సభ్యులతో పాటు బయటి వ్యక్తులు కూడా వచ్చినట్టు వీడియోల్లో ఉందన్నారు. అసెంబ్లీలోకి వచ్చేందుకు ప్రయత్నించిన బయటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా జిల్లా ఎస్పీ, డీజీపీకి ఆదేశాలు ఇస్తున్నట్టు స్పీకర్ చెప్పారు.

ముఖ్యమంత్రి పట్ల, మార్షల్స్ పట్ల చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెబితే హుందాగా ఈ అంశానికి ముగింపు పలకాలని తాను భావిస్తున్నానని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీలోకి బయటివారు, అరాచకశక్తులు చొరబడకూడదన్న ఉద్దేశంతోనే భద్రతా సిబ్బంది నిన్న అలా వ్యవహరించారని స్పీకర్ చెప్పారు. స్పీకర్ విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించలేదు. సభలో తనను కూడా అవమానించారని దానికి ముందు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.