ఉల్లి దండలు…. ఉల్లిగడ్డలే కానుకలు….

ఉత్తరప్రదేశ్ లో పెళ్లి చేసుకున్న ఓ జంట ఉల్లిగడ్డల ధరల పెరుగుదల పై నిరసన వినూత్నంగా తెలియచేసింది. అలాగే పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు కూడా ఉల్లినే కానుకలుగా ఆ నవ దంపతులకు అందించారు.

దేశంలో ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వారణాసి (ఉత్తరప్రదేశ్)లో డిసెంబర్ 14 న ఓ వివాహం జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి సమయంలో పూల దండలు మార్చుకోవడం తెలిసిందే. అయితే ఈ కొత్త జంట మాత్రం పూల దండలకు బదులుగా ఉల్లిగడ్డల దండలను మార్చుకున్నారు.

ఉల్లి, వెల్లుల్లి గడ్డలను దండలుగా కూర్చి తయారుచేసిన హారాలను మార్చుకుని ఈ జంట జనానికి వినూత్నమైన సందేశాన్ని పంపింది.

ముందుగా దండలను ఇలాగే మార్చుకోవాలని అనుకున్నారు…. కాబట్టి బంధువులకు కూడా ఆ సంగతి తెలిసింది. దీంతో వారు నూతన దంపతులకు ఉల్లిగడ్డల బుట్టలను కానుకలుగా ఇచ్చారు.

ఇది తెలిసిన ప్రతిపక్ష సమాజ్ వాది పార్టీ ఈ సంఘటన పై స్పందించింది. కమల్ పటేల్ అనే నాయకుడు మాట్లాడుతూ… ”గత నెల రోజుల నుంచి ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజలు బంగారం కన్నా ఉల్లిని విలువైనదిగ భావించడం ప్రారంభించారు. అందుకే ఈ దంపతులు ఉల్లి, వెల్లుల్లి గడ్డల దండలను మార్చుకున్నారు…” అని అన్నారు.

సత్య ప్రకాష్ అనే మరో సమాజ్ వాది పార్టీ లీడర్ స్పందిస్తూ… ” ఉల్లి వంటి నిత్యావసరాల ధరల పెరుగుదల ను వ్యతిరేకిస్తూ పెళ్లికూతురు, పెళ్లికొడుకు జనానికి తమ చర్య ద్వారా ఒక మంచి మెసేజ్ ఇచ్చార ”ని అన్నారు.