కుల, మత విద్వేషం, హింసా ప్రవృత్తీ చొరబడ్డాయి… సమాజంలో లేని సమస్యలను పవన్ సృష్టిస్తున్నారు… పార్టీలో కాస్త గుర్తింపు వస్తే పవన్‌ చేతిలో రన్ అవుటే…

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధాంత పరంగా గాడి తప్పారని… అందుకే తాను బయటకు వచ్చానని పవనిజం సృష్టికర్త రాజు రవితేజ వివరించారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన… తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారని అందుకే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు.

జనసేన అన్నది గ్రాస్‌ రూట్స్‌లో అస్సలు లేదని… బలోపేతం చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. సొంత పార్టీలోని నేతలపై స్కీమ్స్ వేయడం, మరొకరిని పైకి రాకుండా అడ్డుకోవడం, ఎవరి వద్దా సలహాలు తీసుకోకపోవడం వంటి లక్షణాలు ఉండేవన్నారు. పార్టీని పవన్ కల్యాణ్‌ వ్యక్తిగతంగా వాడుకున్నారని ఆరోపించారు.

పార్టీ అనేది ఎప్పుడూ కూడా వ్యక్తిగత ఆస్తి కాదని… పబ్లిక్ ఆర్గనైజేషన్ అన్నది మరిచిపోయి వ్యక్తిగత స్థాయిలో వాడుకున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ప్రసంగాలు చూసి పార్టీలోని నేతలే షాక్‌ అయ్యారన్నారు. కోపంతో, ధ్వేషంతో, అనుచితంగా ప్రసంగాలు చేయడం వల్ల ఉన్న మద్దతు కూడా పోయిందన్నారు. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పార్టీలో అగ్రస్థానంలో ఉన్న నేతలే ఎక్కువగా సంతోషపడ్డారన్నారు.

పవన్ కల్యాణ్ వ్యవహార శైలి వల్ల ఆయన్ను ప్రత్యర్థి పార్టీలోని వారికంటే…. సొంత పార్టీలోని వారే ఎక్కువగా ధ్వేషించే పరిస్థితి వచ్చిందన్నారు. గత నెలన్నరగా పవన్ కల్యాణ్‌ తీరు మరింత శృతిమించిపోయిందన్నారు. సమస్య లేని సమాజంలో సమస్యను సృష్టించే వ్యక్తిగా పవన్ కల్యాణ్ మారిపోయారన్నారు. పవన్ కల్యాణ్‌ ప్రతి స్పీచ్‌లోనూ కులాల ప్రస్తావన తేవడం వల్ల ప్రజలు ఆయన్ను పట్టించుకోవడం మానేశారన్నారు. కానీ ఆయన్ను గుడ్డిగా నమ్మే వారు మాత్రం దాన్ని ఫాలో అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.

పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో కులాలు, మతాల గురించి పెడుతున్న ట్వీట్లకు చాలా విద్వేషపూరితమైన ప్రతిస్పందనలు నెటిజన్ల నుంచి రావడం చూసి తనకు ఆందోళన కలిగిందన్నారు. సున్నితమైన మత అంశాలను కూడా కదిలించడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని వాటిని పట్టించుకోవడం లేదన్నారు. ఇవన్నీ కూడా దాటి ఇప్పుడు హింసపూరిత వైఖరి కూడా పార్టీలోకి చొరబడిందన్నారు.

పార్టీ అధ్యక్షుడి సమక్షంలోనే నరికేస్తా, చంపేస్తా అనడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అక్కడే ఉన్న పవన్ కల్యాణ్ దాన్ని ఖండించకపోవడం చూసి ఆశ్చర్యపోయామన్నారు. మౌనంగా ఉండడం కూడా సమర్ధించడమే అవుతుందన్నారు. తీరా ఎన్నికల సమయం వచ్చే సరికి పవన్ కల్యాణ్ అసలు రూపం బయటపడిపోయిందన్నారు. కులం, మతం, హింస వంటి వాటి వైపు పార్టీ అడుగులు వేయడంతోనే తాను బయటకు వచ్చానన్నారు.

మ్యాచ్ ఫిక్సింగ్‌లు ఉంటాయని తెలుసు కానీ… మనం చేస్తాం అని అనుకోలేదన్నారు. పార్టీ ప్రారంభంలో ఏర్పాటు చేసుకున్న సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా పవన్ కల్యాణ్ తీరు ఉందన్నారు. ”ఆయనతో వర్క్ చేయకండి… ఆయన్ను నమ్మకండి” అన్నదే తాను పార్టీ నేతలకు ఇచ్చే సలహా అని అన్నారు. పవన్ కల్యాణ్ చేసేది నమ్మాలి గానీ.. చెప్పేది నమ్మవద్దన్నారు. మాటల విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ చాలా గౌరవం చూపిస్తారన్నారు.

పార్టీలో మంచి టీం ఉండేది కానీ… ఎవరికీ స్వేచ్చ ఉండేది కాదన్నారు. జనసేనలో కెప్టెన్‌, బ్యాట్స్‌మెన్, బౌలర్, అంపైర్, కీపర్ అన్ని పవనే అన్నారు. ఎవరైనా బాగా ఆడుతుంటే పవన్‌ కల్యాణే రన్‌ అవుట్ చేసి పంపిస్తారని విమర్శించారు. రాజకీయాల్లోని కులం, మతం అన్న వ్యాధిని నిరోధించాలని పార్టీ పెట్టి… ఇప్పుడు అదే పని చేస్తే ఎలా అని ప్రశ్నించారు.

పవన్‌ కల్యాణ్‌కు ఏ కులం మీద, ఏ మతం మీద ఆసక్తి లేదని… కానీ రాజకీయం కోసం కులం, మతంను వాడే ప్రయత్నం చేస్తున్నారని… అది మరింత ప్రమాదకరమని రాజు రవితేజ అభిప్రాయపడ్డారు. కులం మీద, మతం మీద నిజంగా ప్రేమ ఉండి పనిచేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారని..కానీ కేవలం రాజకీయం కోసమే కులం, మతం వాడడం అన్నది చాలా ప్రమాదకరమైన పని అని అభిప్రాయపడ్డారు.

పవన్ కల్యాణ్ నేరుగా ఎక్కడా యుద్ధం చేయరని… నేరుగా యుద్ధం చేస్తే ఓడిపోతానని ఆయనకు కూడా తెలుసన్నారు. అందుకే పరోక్షంగా దాడి చేయిస్తారన్నారు. నెత్తురు కారుతున్నా… ఎవరు పొడిచారో కూడా తెలియని విధంగా పవన్ కల్యాణ్ తీరు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి రాజకీయాల వల్లే చాలా మంది జనసేన నుంచి వెళ్లిపోయారన్నారు.

అధినేత ఓడిపోయిన పార్టీ, ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే ఉన్న పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తా అంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రశ్నించే హక్కు ఉంటుంది గానీ… ఆధిపత్యం చెలాయించే హక్కు ఉండదన్నారు. జగన్‌మోహన్ రెడ్డి మీద పవన్‌ కల్యాణ్‌కు వ్యక్తిగత ద్వేషం ఉందన్నది నిజమని.. కానీ దానికి కారణం ఏమిటన్నది పవన్ కల్యాణ్ చెబుతేనే బాగుంటుందన్నారు. పవన్ కల్యాణ్ బౌల్ చేసినప్పుడు అవతలి వారు బ్యాటింగ్ ఆడకుండా ఎలా ఉంటారని రాజు రవితేజ ప్రశ్నించారు.