పవన్ ఒక విద్వేష పూరిత ప్రమాదకర విభజన కారి… పవనిజం సృష్టికర్త రాజు రవితేజ

జనసేనకు మరో గట్టి షాక్ తగిలింది. పవన్ కు అత్యంత సన్నిహితుడు, పవనిజం రచయిత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ జనసేన కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ ఒకప్పుడు మంచి మనిషి అని ఇప్పుడు మాత్రం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ వ్యవహార శైలి నచ్చకే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. పవన్ ను ఒక ప్రమాదకర శక్తిగా అభివర్ణించారు.

“పార్టీ భావజాలం, రాజ్యాంగాన్ని సృష్టించి, పార్టీని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించాను. జనసేన మెదటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. ప్రస్తుతం నేను పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిని. పవన్‌ కోరిక మేరకు నాకు ఈ పదవి ఇష్టం లేకపోయినా అంగీకరించాను. ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్‌.. ప్రస్తుతం కక్షసాధింపుతనం, కుల, మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారు. రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించటానికి అతన్ని అనుమతించకూడదు. పవన్‌ కల్యాణ్‌ ఎటువంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాదు. పవన్‌ కల్యాణ్‌ సమాజానికి ప్రమాదం’ అని రాజు రవితేజ్‌ వ్యాఖ్యానించారు.

తొలినుంచి కూడా రాజు రవితేజ పవన్ తోనే ఉన్నారు. పార్టీ పెట్టడానికి ప్రేరణ రాజు రవితేజే అని గతంలో పవన్ స్వయంగా చెప్పారు. జనసేన రాజ్యాంగంగా భావించే పవనిజం ను రచించింది ఈయనే.