మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసిన టీడీపీ నేత కుమారుడు… దేహశుద్ది చేసిన స్థానికులు..!

మద్యం మత్తులో ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి.. ఒక యువకుడు గాయాలపాలవ్వడానికి కారకుడైన టీడీపీ నేత కుమారుడిని స్థానికులు దేహశుద్ది చేసిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కుమారుడు బండారు అప్పల నాయుడు మద్యం తాగి బీచ్ రోడ్డుపైకి వచ్చాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు.

అంతే కాకుండా ఆ తర్వాత డివైడర్ పైకి ఎక్కి.. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తాకి కారు ఆగిపోయింది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపైన ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కారులో ఉన్న అప్పలనాయుడిని బయటకు లాగి దేహశుద్ది చేశారు. దీంతో అతను కారును అక్కడే వదిలేసి తన అనుచరులతో సహా అక్కడి నుంచి పారిపోయాడు.

పోలీసులు అక్కడకు చేరుకొని గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.