పీకల్లోతు కష్టాల్లో చంద్రబాబు…. వెంటాడుతున్న పాత కేసులు !

ఏపీలో టీడీపీ ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. సీనియర్ నేతలను కూడా కట్టడి చేస్తూ పార్టీని ఒక నియంతలా నడిపించారు చంద్రబాబు.

గతంలో తన రాజకీయ పలుకుబడితో తనపై నమోదైన ఎన్నో కేసుల విషయంలో స్టేలు తెచ్చుకొని చక్రం తిప్పాడు. కానీ ఇప్పుడు అతని రాజకీయ చాణక్యం పని చేయడం లేదు. అటు కేంద్రం నుంచి కూడా మద్దతు లేకపోవడం… రాష్ట్రంలో దారుణమైన ఇమేజ్ తో పాటు… గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి.

పార్టీ ఓటమి తర్వాత ముఖ్యమైన నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడి వెళ్లిపోయారు. సీనియర్ నేతలు కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నారు. దీనికి తోడు అక్రమాస్తుల కేసు, ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి రావడం బాబును మరింత అందోళనకు గురిచేస్తోంది.

తన కేసుల నుంచి దృష్టి మళ్లించడాని ఆ మధ్య ఇసుక దీక్ష అని చేపట్టారు. దానికి పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొనక పోవడం చంద్రబాబును మరింత అసహనానికి గురిచేసింది.

చంద్రబాబుపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని కేసులు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. 2005లో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి పిర్యాదు మేరకు ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఈ కేసును ఏసీబీ తిరిగి తెరిచింది.

ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఓటుకు నోటు దర్యాప్తు పై కేసు వేశారు. ఈ కేసు విచారణకు రాబోతోంది.

ఈ రెండు కేసులు ఒకేసారి విచారణకు వస్తే.. బాబుకు మరిన్ని కష్టాలు ప్రారంభం కాక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ మధ్య నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ అధినేతతో భేటీ అయ్యారని.. అంతే కాకుండా నితిన్ గడ్కరితో కలిసి కేంద్రాన్ని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒకవైపు పార్టీని నడపలేక… మరోవైపు తన కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక… చంద్రబాబు చాలా ఆందోళనకు గురవుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.