చావు కబురు చల్లగా చెప్పిన కార్తికేయ

ఇదేదో ప్రాస కోసం పెట్టిన హెడ్డింగ్ కాదు. కార్తికేయ కొత్త సినిమా పేరు. పైగా గీతాఆర్ట్స్ బ్యానర్ లో రాబోతున్న సినిమా పేరు. అవును.. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై కార్తికేయ హీరోగా కొత్త సినిమాను ప్రకటించారు. ఈ మూవీకి ‘చావుకబురు చల్లగా’ అనే టైటిల్ పెట్టారు.

టైటిల్ ఎంత కొత్తగా ఉందో, సినిమా కథ కూడా అంతే కొత్తగా ఉంటుందట. ఈ సినిమాతో కౌషిక్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. కథ, స్క్రీన్ ప్లే మొత్తం అతడిదే. బన్నీ వాస్ నిర్మాతగా, అల్లు అరవింద్ సమర్పణలో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

నిజానికి ఇదేదో ఇప్పుడు హఠాత్తుగా వచ్చిన సినిమా ప్రకటన కాదు. కొన్నాళ్ల కిందట కార్తికేయ నటించిన గుణ369 సినిమా ట్రయిలర్ లాంఛ్ కు వెళ్లారు అల్లు అరవింద్. కార్తికేయతో సినిమా చేస్తానని అప్పుడే ప్రకటించారు. చెప్పినట్టుగానే ఇప్పుడు సినిమా ప్రకటన వచ్చేసింది.