Telugu Global
National

మద్యం వ్యాపారం చేస్తూ... మద్యం పై యుద్ధమా?... అత్తా వర్సెస్ మేనల్లుడి రాజకీయం 

అత్తా అల్లుళ్ళ తగాదాలు నడిగడ్డ రాజకీయాలను రోజురోజుకు వేడెక్కిస్తూనే ఉన్నాయి. అందుకు తాజా ఉదాహరణ ఇది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల ప్రాంతాన్ని నడిగడ్డ అంటారు. ఈ నడిగడ్డ కేంద్రంగానే ఇటీవల కాలం వరకు జిల్లా రాజకీయాలు వేడివేడిగా సాగేవి. రాజకీయాల కోసం బంధుత్వాలను పక్కన పెట్టిన ఉదాహరణలలో నడిగడ్డ రాజకీయం తెలంగాణలో అగ్రస్థానం లో నిలుస్తుంది. గద్వాల కేంద్రంగా డీకే సమరసింహారెడ్డి, డీకే భరత సింహారెడ్డి నిన్న మొన్నటి వరకు జిల్లా రాజకీయాల్లో కీలక […]

మద్యం వ్యాపారం చేస్తూ... మద్యం పై యుద్ధమా?... అత్తా వర్సెస్ మేనల్లుడి రాజకీయం 
X

అత్తా అల్లుళ్ళ తగాదాలు నడిగడ్డ రాజకీయాలను రోజురోజుకు వేడెక్కిస్తూనే ఉన్నాయి. అందుకు తాజా ఉదాహరణ ఇది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల ప్రాంతాన్ని నడిగడ్డ అంటారు. ఈ నడిగడ్డ కేంద్రంగానే ఇటీవల కాలం వరకు జిల్లా రాజకీయాలు వేడివేడిగా సాగేవి. రాజకీయాల కోసం బంధుత్వాలను పక్కన పెట్టిన ఉదాహరణలలో నడిగడ్డ రాజకీయం తెలంగాణలో అగ్రస్థానం లో నిలుస్తుంది.

గద్వాల కేంద్రంగా డీకే సమరసింహారెడ్డి, డీకే భరత సింహారెడ్డి నిన్న మొన్నటి వరకు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కొన్నేళ్లపాటు జిల్లా రాజకీయాలను వీరు శాసించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఇప్పుడు డీకే అరుణ, ఆమె మేనల్లుడు కృష్ణ మోహన్ రెడ్డి మధ్య పోరు నడుస్తున్నది. వీరు అత్తా-అల్లుళ్లయినా వీరి మధ్య పోటీ భీకరంగా ఉంటుంది. ఇప్పటికే ఇద్దరి మధ్య మూడు సార్లు పోటీ జరిగింది. డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ తరఫున గద్వాల నుండి పోటీ చేయగా… ఆమె ప్రత్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డి ఒకసారి తెలుగుదేశం నుంచి, మరోసారి టిఆర్ఎస్ నుంచి ఆమెపై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మూడోసారి 2018లో అత్త అరుణపై కృష్ణ మోహన్ టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక అప్పట్నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. రాజకీయాలు, వ్యాపారాలు కలగాపులగం అయ్యి పరస్పర విమర్శల్లో అవి వ్యక్తమవుతూ వచ్చాయి.

తాజాగా కృష్ణమోహన్ రెడ్డి అత్తగారి సారా వ్యతిరేక ఉద్యమ ప్రయత్నాలను తిప్పికొట్టెందుకు చేసిన విమర్శలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

డీకే అరుణ పార్లమెంటరీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారారు. తర్వాత మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నిలిచి ఓటమి పాలయ్యారు. అయితే తెలంగాణలో టిఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చే పార్టీ బీజేపీ అని ప్రచారం చేస్తూ, ఆ పార్టీలో కీలక పదవి దక్కించుకోవడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు.

ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఆమె ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం మద్యాన్ని నిషేధించాలని గట్టిగా కోరుతూ విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలను ఆమె మేనల్లుడు కృష్ణ మోహన్ తీవ్రంగా తిప్పి కొడుతున్నారు.

అసలు డీకే అరుణ కుటుంబం మొత్తం మద్యం వ్యాపారం మీదే ఆధారపడి రాజకీయాలు నడుపుతుందని, అందుకు జిల్లా వ్యాప్తంగా వారికున్న దాదాపు 25 మద్యం దుకాణాలే సాక్ష్యాలనీ… ఆయన బయటి ప్రపంచానికి అంతగా తెలియని రహస్యాన్ని బయటపెట్టారు.

నిజంగా మహిళల పట్ల ప్రేమ ఉంటే ముందు తన భర్త భరత సింహారెడ్డి నడుపుతున్న మద్యం దుకాణాలను మూసివేసి… ఆ తర్వాతే ప్రభుత్వాన్ని మద్య నిషేధం గురించి విమర్శించాలి అని ఆయన అన్నారు. దీంతో అత్తా అల్లుళ్ళ మధ్య వ్యవహారం మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అల్లుడు చేసిన ఈ విమర్శకు అత్త అరుణ ఏ విధంగా సమాధానం ఇస్తుందో ఎదురు చూడాల్సిందే.

First Published:  15 Dec 2019 6:59 AM GMT
Next Story