మరో సినిమా ప్రకటించిన నాగచైతన్య

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు నాగచైతన్య. ఒక సినిమా కంప్లీట్ అయిన వెంటనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. మజిలీ సినిమా కంప్లీట్ అయిన వెంటనే వెంకీమామ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే శేఖర్ కమ్ముల సినిమాకు కమిట్ అయ్యాడు. ఇప్పుడా సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాగచైతన్య. ఈరోజు ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట కలిసి ఈ సినిమా నిర్మించబోతున్నారు. అలా గీతగోవిందం వచ్చిన చాన్నాళ్లకు మరో సినిమా లాక్ చేసుకోగలిగాడు పరశురాం.

నిజానికి గీతగోవిందం తర్వాత పరశురాంకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ పారితోషికం, బడ్జెట్ సెట్ అవ్వక నిర్మాతలంతా వెనక్కు తగ్గారు. ఒక దశలో మహేష్ బాబుకు కూడా కథ వినిపించాడు పరశురాం. కానీ వర్కవుట్ కాలేదు. అలా దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత నాగచైతన్య హీరోగా సినిమా పట్టేశాడు పరశురాం. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉండే అవకాశం ఉంది.