పుకార్లు ఖండించిన రాశిఖన్నా

హీరోయిన్లపై పుకార్లు సహజం. అందుకే వాటిని పెద్దగా పట్టించుకోరు హీరోయిన్లు కూడా. కానీ కొన్ని పుకార్లు చాలా సీరియస్ గా ఉంటాయి. మొత్తం కెరీర్ నే ప్రమాదంలో పడేస్తాయి. అలాంటి వాటిపై మాత్రం వెంటనే స్పందించాలి. రాశిఖన్నా అదే పని చేసింది. తనపై వచ్చిన ఓ పుకారును సీరియస్ గా ఖండించింది.

రాశిఖన్నా ఈమధ్య ముంబయిలో పెద్ద ఫ్లాట్ కొనుగోలు చేసిందట. త్వరలోనే అక్కడకు మకాం మార్చేస్తుందట. కాస్త లోతుగా ఆలోచిస్తే ఈ పుకారులో చాలా సీరియస్ నెస్ దాగుంది. ఇదే నిజమని నిర్మాతలు నమ్మితే, ఆమెకిక అవకాశాలు తగ్గినట్టే. ఎఁదుకంటే హీరోయిన్ అందుబాటులో ఉంటేనే యూనిట్ కు పని ఈజీ. ముంబయి వెళ్లి కూర్చుంటే అన్నింటికీ ఇబ్బందే. అందుకే రాశిఖన్నా ఈ పుకారుపై స్పందించింది.

ముంబయిలో ఇల్లు కొన్నానన్న వార్తలో నిజం లేదంటోంది రాశిఖన్నా. నాలుగేళ్ల కిందటే హైదరాబాద్ లో తను ఇల్లు కొనుగోలు చేశానని, ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటున్నానని స్పష్టంచేసింది. అంతేకాదు, తను టాలీవుడ్ లో ఉంటానని, మరిన్ని సినిమాలు చేస్తానని కూడా క్లారిటీ ఇచ్చింది.