నిర్భయ కేసులో ట్విస్ట్… రివ్యూ పిటిషన్ వాదనలు వినబోనన్న సీజేఐ..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో నిందితులకు ఉరి శిక్ష ఖరారైన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లోనే వారిని ఉరి తీస్తారని అనుకుంటుండగా దోషుల్లో ఒకడైన అక్షయ్ తనకు క్షమాభిక్ష ప్రసాదించమని సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు. అయితే ఈ రివ్యూ పిటిషన్‌పై వాదనలను తాను వినబోనంటూ ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ బాబ్డే తప్పుకున్నారు.

నిర్భయ తరపున గతంలో సుప్రీంకోర్టులో బాబ్డే కోడలు వాదించింది. రివ్యూ పిటిషన్ సమయంలో కూడా ఆమె నిర్భయ తరపున వాదించే అవకాశం ఉంది. దీంతో తన కోడలు వాదించే ఏ కేసులో కూడా తాను వాదనలు విని తీర్పు ఇవ్వనని సీజేఐ స్పష్టం చేశారు. సీనియర్ న్యాయమూర్తితో రేపు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని.. రేపే ఆ ధర్మాసనం వాదనలు వింటుందని ఆయన వెల్లడించారు.

వాస్తవానికి రివ్యూ పిటిషన్‌పై ఇవాళ వాదనలు వినాల్సి ఉంది. జస్టీస్ బాబ్డే హఠాత్తుగా తప్పుకోవడంతో బుధవారానికి వాయిదా పడింది. కాగా రేపు కొత్త ధర్మాసనం వాదనలు విని వెంటనే తీర్పును ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది.