Telugu Global
NEWS

ఏపీకి మూడు రాజధానులు... జగన్ సంచలన ప్రకటన

రాజధానిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మరో వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వస్తుందని చెబుతూనే… రాజధాని విషయంలో తమ ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్టు తన ప్రకటన ద్వారా భావించవచ్చు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజధాని కోసం ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి.. ముందే ఆ ప్రాంతంలో కావాల్సిన వారితో భూములు కొనుగోలు చేయించారన్నారు. ఆ ప్రాంతంలోని 53వేల ఎకరాల ప్రాంతంలో విద్యుత్, రోడ్లు,డ్రైనేజ్, మంచి నీరు వంటి మౌలిక […]

ఏపీకి మూడు రాజధానులు... జగన్ సంచలన ప్రకటన
X

రాజధానిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మరో వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వస్తుందని చెబుతూనే… రాజధాని విషయంలో తమ ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్టు తన ప్రకటన ద్వారా భావించవచ్చు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు రాజధాని కోసం ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి.. ముందే ఆ ప్రాంతంలో కావాల్సిన వారితో భూములు కొనుగోలు చేయించారన్నారు. ఆ ప్రాంతంలోని 53వేల ఎకరాల ప్రాంతంలో విద్యుత్, రోడ్లు,డ్రైనేజ్, మంచి నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఎకరాకు రెండు కోట్ల రూపాయలు అవుతుందన్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన అంచనాలేనని వివరించారు. ఈ లెక్కన మొత్తం లక్షా 9వేల కోట్లు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే అవసరం అవుతుందన్నారు. నిర్మాణం మొదలైన తర్వాత ఈ ఖర్చు మరింత పెరగవచ్చని… వడ్డీలతో కలుపుతూ పోతే అది ఆఖరికి మూడు నాలుగు లక్షల కోట్లలోకి వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో లక్షల కోట్లు అప్పు తెచ్చి రాజధాని కట్టే పరిస్థితి ఉందా అన్నది ఆలోచన చేయాలన్నారు. బొల్లేపల్లి రిజర్వాయర్ నిర్మించి రాయలసీమకు నీటిని తరలించే ప్రాజెక్టుకు 55వేల కోట్లు అవసరం అవుతుందని చెప్పారు. భారీ వర్షాలు ఈ ఏడాది వచ్చినా రాయలసీమలో ప్రాజెక్టులు నింపలేని పరిస్థితి ఉందన్నారు. కాలువ సామర్థ్యం లేక నీరు వృథా అయిపోయాయన్నారు. కాలువ సామర్థ్యం పెంపు కోసం 23 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు.

వెనుక బడిన ఉత్తరాంధ్రలో సుజలస్రవంతి ప్రాజెక్టు పూర్తి చేయడానికి దాదాపు 16వేల కోట్ల రూపాయలు అవసరం ఉందన్నారు. తాగటానికి మంచినీరు లేని గ్రామాలు ఉన్నాయని… గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయని , బోర్లు వేస్తే సముద్రం ఉప్పునీరు వస్తున్నాయన్నారు. అలాంటి పరిస్థితిలో ధవళేశ్వరం నుంచి వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీటిని అందించాలనుకుంటున్నామన్నారు. అందుకోసం గోదావరి జిల్లాలకే ఒక్కో జిల్లాకు నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తాగడానికి మంచి నీరు ఇవ్వడానికి 40వేల కోట్ల వరకు డబ్బు అవసరం అవుతుందన్నారు.

నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్లు, ఆస్పత్రులను బాగు చేయడానికి 30 వేల కోట్ల వరకు అవుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని ప్రాంతంలోని కేవలం 20 కి.మీ పరిధిలోనే 53వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాల కోసమే లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి చాలా భారమవుతుందన్నారు. అన్ని కోణాల్లో ఆలోచన చేసిన తర్వాత అభివృద్ది వికేంద్రీకరణ అన్నది చాలా అవసరమన్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఆఖరిలో అసలు సంగతి చెప్పేశారు సీఎం.

రాజధాని నిర్మాణం ఖర్చు తగ్గించుకునేందుకు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఆలోచనను వివరించారు. అమరావతిలోనే శాసనసభ ఉంటుందన్నారు. అమరావతిని లెజిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా చేసి, విశాఖను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా చేసి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్‌గా మార్చవచ్చు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఎం ఈ ప్రకటన చేయగానే సభలో సభ్యులు బల్లలు చరిచి స్వాగతించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగడంతోపాటు ఖర్చు తగ్గుతుందన్నారు.

First Published:  17 Dec 2019 9:45 AM GMT
Next Story