ఎక్కడ కలిసిందో అక్కడే ప్రపోజ్ చేసింది….

24 ఏళ్ల జియావో జింగ్ అనే చైనా యువతి వినూత్నం గా తన బాయ్ ఫ్రెండ్ కి పెండ్లి ప్రపోజల్ చేసింది. తాను ఏడాది క్రితం మొదటిసారి ఎక్కడైతే తన స్నేహితుడ్ని కలిసిందో అక్కడే ప్రపోజ్ చేసింది.

చైనాలోని హెనాన్ లో ఉన్న ఒక సాంస్కృతిక ప్రదర్శన హాలులో – కె అనే యువకుడి తో జియావో జింగ్ కి పరిచయం అయింది. తరువాత ఆ పరిచయం ప్రేమ గా మారింది. ఇటీవలే వారి పరిచయానికి ఏడాది కాలం నిండింది. ఆ వార్షికోత్సవాన్ని తన ఫ్రెండ్ ని ఆశ్చర్యపరిచేలా జరుపుకోవాలని ప్లాన్ చేసింది. ఆ రోజు (డిసెంబర్ 11)తనని కలవాలని కె ని కోరింది.

ఆమె కుటుంబ సభ్యుల సహాయంతో హాలును అలంకరించింది. తాను పెళ్లి దుస్తులు ధరించింది. ఒక ఇంటి దస్తావేజు, ఒక బిఎమ్‌డబ్ల్యూ కారు తాళం ఉన్న పుష్పగుచ్చాన్ని అందరూ చూస్తుండగా జింగ్ తన చెలికాడికి అందించి పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. కే… ఈ పరిణామానికి ఆశ్చర్యపోయినప్పటికీ… సంకోచం లేకుండా ఔను.. చేసుకుంటానని అక్కడికక్కడే చేప్పేశాడట.

స్థానిక మీడియా కథనం ప్రకారం… ఇల్లు, బిఎమ్‌డబ్ల్యూను ఆమె కుటుంబం సిద్ధం చేసింది. మీడియా తో మాట్లాడుతూ… జింగ్ తనకు భౌతిక వస్తువులు ముఖ్యం కాదని, తనను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకునే తన ప్రియుడి కోసం ఏదైనా చేయాలనుకుంటున్నానని చెప్పిందట.