Telugu Global
National

పానీపూరీ కుర్రోడికి ఐపీఎల్ జాక్ పాట్

భారత క్రికెట్ బోర్డు ఐడియా ఐపీఎల్ దేశంలోని ఎందరో మారుమూల ప్రాంతాలకు చెందిన అనామక క్రికెటర్ల జీవితాలను రాత్రికి రాత్రే మార్చివేస్తోంది. ఏమాత్రం ప్రతిభ ఉన్నా రారమ్మంటూ ఆహ్వానిస్తూ కోట్ల రూపాయల దండను మెడలో వేసి అక్కున చేర్చుకొంటోంది. కోల్ కతా వేదికగా ముగిసిన 2020 ఐపీఎల్ వేలంలో కమిన్స్ లాంటి విదేశీ క్రికెటర్లు భారీ మొత్తం సంపాదించినా… ఉత్తరప్రదేశ్ కుర్రాడు యశస్వి జైస్వాల్ మాత్రం 2 కోట్ల 40 లక్షల రూపాయల వేలం ధర సాధించి.. ఐపీఎల్ కోటీశ్వరుల […]

పానీపూరీ కుర్రోడికి ఐపీఎల్ జాక్ పాట్
X

భారత క్రికెట్ బోర్డు ఐడియా ఐపీఎల్ దేశంలోని ఎందరో మారుమూల ప్రాంతాలకు చెందిన అనామక క్రికెటర్ల జీవితాలను రాత్రికి రాత్రే మార్చివేస్తోంది. ఏమాత్రం ప్రతిభ ఉన్నా రారమ్మంటూ ఆహ్వానిస్తూ కోట్ల రూపాయల దండను మెడలో వేసి అక్కున చేర్చుకొంటోంది.

కోల్ కతా వేదికగా ముగిసిన 2020 ఐపీఎల్ వేలంలో కమిన్స్ లాంటి విదేశీ క్రికెటర్లు భారీ మొత్తం సంపాదించినా… ఉత్తరప్రదేశ్ కుర్రాడు యశస్వి జైస్వాల్ మాత్రం 2 కోట్ల 40 లక్షల రూపాయల వేలం ధర సాధించి.. ఐపీఎల్ కోటీశ్వరుల జాబితాలో చేరాడు.

నిత్యం పోరాటమే….

ఉత్తరప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామంలోని ఆరుగురు పిల్లల కుటుంబం నుంచి… క్రికెట్ పిచ్చితో పదేళ్ల వయసులోనే భారత క్రికెట్ ప్రధాన కేంద్రం ముంబైకి పారిపోయి వచ్చిన 17 ఏళ్ల యశస్వి జైస్వాల్ జీవితాన్ని… ముంబై జూనియర్ క్రికెట్ తో పాటు.. అతని అంకితభావం, పట్టుదల, నిరంతర పోరాటం ఒక్కసారిగా మార్చి వేశాయి.

నిక్కరు, చొక్కా ధరించి ముంబై మహానగరానికి చేరిన పల్లెటూరి అమాయకపు చిన్నోడు యశస్వి కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర కోసం నిరంతరం పోరాటమే చేయాల్సి వచ్చింది. ముంబై ఫుట్ పాత్ లు, బాంద్రా ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ గుడారంలో తలదాచుకొంటూ తన ప్రస్థానం కొనసాగించాడు.

ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి విలవిలలాడిపోతూ వచ్చిన ఈ కుర్రోడు కడుపునింపుకోడానికి పానీపూరి దుకాణంలో సహాయకుడిగా పనిచేస్తూ వచ్చాడు. పని చేసినందుకు ప్రతిఫలంగా పెట్టిన పానీపూరితో రోజూ కడుపునింపుకొంటూ వచ్చిన యశస్వి.. చివరకు జ్వాలాసింగ్ అనే ఓ క్రికెట్ శిక్షకుడి కంటపడ్డాడు.

యశస్విలోని అసాధారణ ప్రతిభ, క్రికెట్ పట్ల అతనికి ఉన్న ఆరాధనాభావానికి జ్వాలాసింగ్ ముగ్దుడయ్యాడు. తన క్రికెట్ అకాడమీలో సహాయకుడిగా చేర్చుకొని.. శిక్షణ ఇస్తూ…క్రికెట్ రోలర్, ఇతర పరికరాలు ఉంచే స్టోర్ రూమ్ లో పడుకోడానికి అనుమతి ఇచ్చాడు.

సచిన్ బ్యాటుతో జైత్రయాత్ర….

కనీస అవసరాలైన తిండి, నిద్రలకు ఢోకా లేకపోడంతో యశస్వి క్రికెట్ మీద మనసు కేంద్రీకరించగలిగాడు. ముంబై సబ్ జూనియర్ క్రికెట్ లో పాల్గొంటూ తనలోని అసాధారణ ప్రతిభను చాటుకొంటూ వచ్చాడు.

యశస్విలోని ప్రతిభ గురించి విన్న మాస్టర్ సచిన్ టెండుల్కర్ తన ఆటోగ్రాఫుతో కూడిన ఓ బ్యాటును కానుకగా ఇచ్చాడు. తన అభిమాన క్రికెటర్ సచిన్ బ్యాటు ఇచ్చి భుజం తట్టడంతో యశస్వి ఆనందానికి అంతేలేకుండా పోయింది.

దూకుడుగా ఆడే ఓపెనర్ గా, వికెట్లు సాధించి లెగ్ స్పిన్నర్ గా గుర్తింపు తెచ్చుకొన్న యశస్వి… ముంబై అండర్ -16 జట్టులో చోటు సంపాదించడమే కాదు.. డబుల్, ట్రిపుల్ సెంచరీలు బాదేస్తూ అండర్ -19 జట్టులోనూ చోటు సంపాదించాడు.

కేవలం 17 సంవత్సరాల వయసులోనే యశస్వి దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జరిగే జూనియర్ ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు ఆడబోతున్నాడు.

భారత అండర్ -19 జట్టులో సభ్యుడిగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్ దేశాల జట్లతో జరిగిన సిరీస్ ల్లో ఆల్ రౌండ్ ప్రతిభతో అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. హేమాహేమీలతో కూడిన ముంబై రంజీజట్టులో సభ్యుడు కావడం ద్వారా యశస్వి మరో మెట్టు పైకెక్కాడు.

జార్ఖండ్ తో ముగిసిన ముస్తాక్ అలీ ట్రోఫీ క్రికెట్ లీగ్ మ్యాచ్ లో యశస్వి డబుల్ సెంచరీ సాధించడం ద్వారా…ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే 17 సంవత్సరాల వయసులో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

అంతేకాదు…ఐపీఎల్ 13వ సీజన్ వేలంలో 2 కోట్ల 40 లక్షల రూపాయల ధరకు రాజస్థాన్ రాయల్స్ కు సొంతమయ్యాడు. 20 లక్షల రూపాయల కనీసధరతో యశస్వి వేలం మొదలై చివరకు 2కోట్ల రూపాయలు దాటిందంటే అతనికోసం ఫ్రాంచైజీలు ఏస్థాయిలో పోటీపడిందీ మరి చెప్పాల్సిన పనిలేదు.

ఐపీఎల్ వేలంలో మెరిసిన ఇతర దేశవాళీ జూనియర్ క్రికెటర్లలో రవి బిష్ణోయ్, విరాట్ సింగ్, ప్రియం గార్గ్ సైతం ఉన్నారు.

పియూష్ చావ్లాకు 6 కోట్ల 50 లక్షలు

ఐపీఎల్ వచ్చే సీజన్ వేలంలో అత్యధిక ధర సాధించిన భారత క్రికెటర్ గా లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా నిలిచాడు. చావ్లాను 6 కోట్ల 50 లక్షల రూపాయల ధరకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకోగలిగింది. గత సీజన్ వరకూ కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడుతూ వచ్చిన చావ్లా ఇక ధోనీ నాయకత్వంలో ఆడనున్నాడు.

First Published:  21 Dec 2019 9:26 PM GMT
Next Story