Telugu Global
NEWS

బొండా నిరూపించు... రాజీనామా చేస్తా... నీకే రాసిస్తా...

మంగళగిరి మండలం నీరు కొండ గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే భార్య పేరున 5 ఎకరాలు భూమి కొన్నారని… కావాలంటే ఆ విషయాన్ని ఎమ్మెల్యే ఆర్కే అఫిడవిట్‌లో చూసుకోవచ్చని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన ఆరోపణపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. తన భార్య పేరిట 5 ఎకరాలు ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు… ఆ భూమిని కూడా బోండా ఉమాకే రాసిస్తామన్నారు. అఫిడవిట్‌లో ఐదు ఎకరాలు భూమి వివరాలు […]

బొండా నిరూపించు... రాజీనామా చేస్తా... నీకే రాసిస్తా...
X

మంగళగిరి మండలం నీరు కొండ గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే భార్య పేరున 5 ఎకరాలు భూమి కొన్నారని… కావాలంటే ఆ విషయాన్ని ఎమ్మెల్యే ఆర్కే అఫిడవిట్‌లో చూసుకోవచ్చని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన ఆరోపణపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు.

తన భార్య పేరిట 5 ఎకరాలు ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు… ఆ భూమిని కూడా బోండా ఉమాకే రాసిస్తామన్నారు. అఫిడవిట్‌లో ఐదు ఎకరాలు భూమి వివరాలు ఉన్నాయంటూ పచ్చి అబద్దాలను ఉమా చెప్పారన్నారు. అఫిడవిట్ అన్నది బహిరంగంగా ఎవరైనా చూసుకోవచ్చని… అలా తన అఫిడవిట్ చూసి ఐదు ఎకరాల భూమి వివరాలను నిరూపిస్తే ఆ భూమిని రాసిస్తానన్నారు.

బోండా ఉమా ఒక అబద్దాన్ని చెబితే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కనీసం వివరణ తీసుకోకుండా అచ్చేయడం ఏమిటని ఆర్కే ప్రశ్నించారు. ఐదేళ్లుగా రాజధాని పేరుతో చేసిన దుర్మార్గాలు బయటపడుతాయన్న భయంతో చంద్రబాబు దిగజారి రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతానికి చంద్రబాబు ఒక శాపం అని అభివర్ణించారు. ఐదేళ్లలో ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణం చేయలేకపోయారని విమర్శించారు. కనీసం ఒక్క గ్రామంలోనైనా మౌలిక సదుపాయాలు కల్పించారా అని ప్రశ్నించారు.

చంద్రబాబు తాను చేసిన అక్రమాల నుంచి రక్షణ పొందేందుకే కులాన్ని కవచంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్కే విమర్శించారు. డీఎస్పీ రామాంజనేయులును అడ్డుపెట్టుకుని మంగళగిరిలో తనను ఓడించేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారని… కానీ మంగళగిరి ప్రజలు నారా లోకేష్‌ను ఓడించారన్నారు.

రాజధాని గ్రామాల్లో మంత్రులు పుల్లారావు, నారాయణ అర్థరాత్రి వెళ్లి రైతులను బెదిరించి భూములు తీసుకున్నారన్నారు. మాట వినని వారిని హనుమంతరావు అనే సీఐతో కొట్టించి కేసులు పెట్టి వేధించారన్నారు. భూములు ఇచ్చిన వారికి ప్లాట్లు ఇవ్వలేదు, శాశ్వత నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. దళితుల నుంచి అసైన్డ్ భూమలు లాక్కున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.

రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్న బినామీలను కాపాడుకునేందుకే చంద్రబాబు ఇప్పుడు నాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు. పాతిక లక్షల భూమి మూడు కోట్లకు వెళ్లి తిరిగి పాతిక లక్షలకు పడిపోతోందన్న బాధ మాత్రమే చంద్రబాబుకు ఉందన్నారు. అనంతపురం, శ్రీకాకుళం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో భూముల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. అన్ని జిల్లాలు బాగుపడాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే ఉత్తరాంధ్ర, రాయలసీమకు టీడీపీ వ్యతిరేకం అని ప్రకటించాలన్నారు.

చంద్రబాబుకు కొత్త బినామీ పవన్ కల్యాణ్ అని విమర్శించారు. రాజధానిలో చంద్రబాబు అక్రమాలు చేశారని ఆరోపించిన పవన్ కల్యాణ్‌, ఆమరణ దీక్ష చేస్తానన్న పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆమరణ దీక్ష చేస్తానన్న పవన్ కల్యాణ్… అర్థరాత్రి కరకట్ట వద్దకు వెళ్లి ప్యాకేజీలు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయారన్నారు. చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకున్నారు కాబట్టే మంగళగిరిలో జనసేన అభ్యర్థిని నిలబెట్టలేదన్నారు. కనీసం మంగళగిరిలో పవన్ కల్యాణ్ ప్రచారం కూడా చేయలేదన్నారు.

చంద్రబాబు కోసం సొంత పార్టీని కూడా మోసం చేసుకున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆర్కే విమర్శించారు. నారా భువనేశ్వరి తనకు మాతృసమానురాలు అని ఆమెను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. అక్రమంగా నిర్మించిన కరకట్ట భవనంలో నివాసం ఉంటున్న చంద్రబాబును చూసేందుకు వచ్చే సమయంలో … దారి వెంట వెళ్తున్న సమయంలో నాలుగు పంటలు పండే భూములు నాశనం అవుతుంటే భువనేశ్వరికి మనసు కరగలేదా అని ఆర్కే ప్రశ్నించారు.

సొంత తండ్రి ఎన్టీఆర్‌ను చంద్రబాబు రాజకీయంగా హత్య చేసిన రోజు కూడా బయటకు రాని భువనేశ్వరి… ఇప్పుడు బయటకు వచ్చారని… కనీసం ఐదు వేల 900 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ నిర్మాణాలు చేశారో చంద్రబాబును అడగాల్సిందన్నారు. కాగడాలు పట్టుకుని రాజధానిలో నిరసన తెలుపుతున్ననారా లోకేష్… ముందు చంద్రబాబు సొంతిల్లు ఎక్కడ ఉందో చెప్పాలన్నారు.

ముఖ్యమంత్రిగా ఉంటూ రాజధానిలో సొంత ఇల్లు కట్టుకోకపోవడానికి సిగ్గుండాలన్నారు. రాజధానిలో కాకుండా హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోవడంపై సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన లక్షల కోట్లు తెచ్చి… టీడీపీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బ్రోకర్లు, టీడీపీ నేతల భూముల దగ్గర పోయాలా అని నిలదీశారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు వలసకూలీలుగా మిగిలిపోతుంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా… ఇప్పటికే అభివృద్ధి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే అన్నిఉండాలని చెప్పడం ఏమి ధర్మమని చంద్రబాబును ఆర్కే నిలదీశారు. దిగిపోయే నాటికి రాష్ట్రాన్ని మూడున్నర లక్షల కోట్ల అప్పుల్లోకి తోసేసి వెళ్లిన దోపిడిదారుడు చంద్రబాబు అని అభివర్ణించారు.

తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కులాన్ని, రెండు పత్రికలను చంద్రబాబు అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రాజధాని రైతులకు చంద్రబాబు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కౌలును జగన్‌ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత చెల్లించారని గుర్తు చేశారు.

చంద్రబాబుకు భయపడి , బెదిరిపోయి వ్యవసాయం మానేసి ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇచ్చిన రైతులు తిరిగి అడిగితే ఆ భూమి వెనక్కు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి తాను కూడా విజ్ఞప్తి చేస్తానన్నారు. బలవంతపు భూ సేకరణకు చంద్రబాబు ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఎత్తివేయాలని కూడా సీఎంను కోరుతానన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రాజధాని ప్రాంతంలో గ్రామాల్లో వ్యవసాయం ద్వారా ఏటా వెయ్యి కోట్ల ఆదాయం వస్తోందని శ్వేతపత్రం విడుదల చేశారని.. అదే నిజమైతే ఈ రాజధాని ప్రాంతాన్ని అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నానని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు.

First Published:  3 Jan 2020 1:24 AM GMT
Next Story