పబ్జీ గేమ్‌కు బానిస…. 31 సైకిళ్లు చోరీ !

పబ్జీ గేమ్‌కు స్టూడెంట్స్‌ బానిసలవుతున్నారు. విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన… ఇదే రుజువు చేసింది.

హైదరాబాద్‌ మల్కాజిగిరి పక్కనే ఉన్న మౌలాలి నివాసి నందుల సిద్ధార్థ శర్మ పబ్జీగేమ్‌కు అలవాటు పడ్డాడు. అంతేకాకుండా పూర్తిగా బానిస అయ్యాడు. గేమ్‌ ఆడనివ్వకపోతే ఇంట్లో వాళ్లతో గొడవకు దిగేవాడు. దీంతో పాటు డబ్బుల కోసం ఇంట్లోవాళ్లను కూడా వేధించేవాడు.

పబ్జీ గేమ్‌తో పాటు చెడు వ్యసనాలకు బానిసైన సిద్దార్థ శర్మ రాత్రిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడేవాడు. ఇళ్లలో సైకిళ్ళను దొంగిలించి అమ్ముకోవడం ప్రారంభించాడు. దొంగిలించిన సైకిళ్లను వేరే వారి దగ్గర తాకట్లు పెట్టి సొమ్ము చేసుకునేవాడు. ఈ క్రమంలో సైకిళ్ల దొంగతనాలపై మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ కు వరుసగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో నిఘాపెట్టిన పోలీసులు సిద్ధార్థ శర్మను పట్టుకున్నారు.

పబ్జీగేమ్‌తో పాటు విలాసాల కోసం సిద్దార్థ శర్మ 31 సైకిళ్లను దొంగిలించాడు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో 16 సైకిళ్లపై మాత్రమే పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మిగతా సైకిళ్ల బాధితులు ఉంటే రావాలని మల్కాజిగిరి ఏసీపీ నర్సింహా రెడ్డి సూచించారు.