ఆలస్యంగా అల్పాహారం పెట్టిందని… కోడలిని తుపాకితో కాల్చి చంపాడు

షామ్ లాల్ అనే పంజాబ్ కి చెందిన ఓ మామ ఆలస్యంగా అల్పాహారం (టిఫిన్)పెట్టిందని కోడలిని తుపాకితో కాల్చి చంపాడు. గురువారం జరిగిన ఈ సంఘటన స్త్రీల పట్ల భారతీయ పురుషులు కొందరు ఎంత అమానవీయంగా, పెత్తందారీతనం తో వ్యవహరిస్తారో మరోసారి తెలియజేసింది.

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ ప్రాంతానికి చెందిన షామ్ లాల్ భారత వైమానిక దళంలో పనిచేసి రిటైర్ అయ్యాడు. గురువారం నాడు ఉదయం ఆకలవుతున్నదని అల్పాహారం పెట్టమని కోడలు నీలం కుమారిని అడిగాడు. అయితే ఆ సమయంలో ఆమె ఇతర ఇంటి పనులలో బిజీగా ఉంది. అందువల్ల ఆలస్యంగా అల్పాహారాన్ని వడ్డించింది.

తన మాట పట్టించుకోకుండా అలస్యంగా టిఫిన్ పెడుతున్నావేంటి అని షామ్ లాల్ అన్నాడు. ఈ సందర్భం గా జరిగిన వాగ్వాదంతో… కోపోద్రిక్తుడైన షామ్ లాల్ నీలం కుమారి పై తన లైసెన్స్ కలిగిన 12-బోర్ రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. ఇరుగుపొరుగువారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు, కాని ఆమె దారిలోనే మరణించింది.

షామ్ లాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మరో వైపు కొంతమంది దుండగుల దాడిలో కుమారి భర్త మనీష్ కుమార్ తీవ్ర గాయాలపాలై మంచానికే పరిమితమై ఉన్నాడు. ఆమెకు టీనేజ్ కొడుకు ఉన్నాడు.

ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. దర్యాప్తు కొనసాగుతోంది.