వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ రివ్యూ

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ రెడీ అయింది. ఈ సినిమాను వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి క్యారెక్టర్ పోస్టర్లు రిలీజ్ చేసిన యూనిట్, ఈరోజు టీజర్ లాంఛ్ చేసింది. మరోసారి టీజర్ లో విజయ్ దేవరకొండ ఎట్రాక్ట్ చేశాడు.

తనకు మాత్రమే సాధ్యమయ్యే ఎక్స్ ప్రెషన్స్, మేనరిజమ్స్ చూపించాడు విజయ్ దేవరకొండ. ఓ ప్రేమికుడి ఆవేదన, అతడి జీవితంలో ఉండే నలుగురు మహిళలతో అతడి సంఘర్షణను టీజర్ లో చక్కగా చూపించారు. అయితే సమస్యంతా ఒక్కటే. ఈ సినిమా టీజర్ చూస్తుంటే.. గతంలో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్, అర్జున్ రెడ్డి సినిమాలు గుర్తొస్తున్నాయి. అందుకే కొంతమంది ఈ టీజర్ రొటీన్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ విమర్శల సంగతి పక్కనపెడితే.. క్రాంతిమాధవ్ సినిమాలపై మాత్రం ఓ సెక్షన్ కు గట్టి నమ్మకం ఉంది. మంచి కథ లేకుండా అతడు సెట్స్ పైకి వెళ్లడంటారు చాలామంది. గతంలో ఉంగరాల రాంబాబు లాంటి డిజాస్టర్ సినిమా తీసినప్పటికీ, అంతకుముందు ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాలతో క్రాంతిమాధవ్ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ కొత్త సినిమాతో కూడా క్రాంతి మాధవ్ తన టాలెంట్ చూపిస్తాడని చాలామంది భావిస్తున్నారు.