Telugu Global
NEWS

చేసిన పొరపాటే.. మళ్లీ మళ్లీ చేస్తున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మంచి విజన్ ఉన్న నాయకుడు అని చాలామంది చెబుతుంటారు. కొన్ని విషయాల్లో అది నిజమే అనుకోవచ్చు. ఈ దిశగా ఆయన పాటించే కొన్ని విధానాలు మాత్రం.. చాలాసార్లు విమర్శలపాలయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో… చంద్రబాబు వ్యవహార శైలి కూడా ఇలానే మారుతోంది. పదే పదే హైదరాబాద్ తో పోలిక పెడుతూ.. అమరావతి గురించి వ్యాఖ్యలు చేయడాన్ని కొందరు టీడీపీ ప్రేమికులు తప్ప.. మెజారిటీ ప్రజలు హర్షించలేకపోతున్నారు. తాజాగా.. […]

చేసిన పొరపాటే.. మళ్లీ మళ్లీ చేస్తున్న చంద్రబాబు
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మంచి విజన్ ఉన్న నాయకుడు అని చాలామంది చెబుతుంటారు. కొన్ని విషయాల్లో అది నిజమే అనుకోవచ్చు. ఈ దిశగా ఆయన పాటించే కొన్ని విధానాలు మాత్రం.. చాలాసార్లు విమర్శలపాలయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో… చంద్రబాబు వ్యవహార శైలి కూడా ఇలానే మారుతోంది. పదే పదే హైదరాబాద్ తో పోలిక పెడుతూ.. అమరావతి గురించి వ్యాఖ్యలు చేయడాన్ని కొందరు టీడీపీ ప్రేమికులు తప్ప.. మెజారిటీ ప్రజలు హర్షించలేకపోతున్నారు.

తాజాగా.. అమరావతిలో ఆందోళనలు ఇవాల్టితో (జనవరి 6) 20 వ రోజుకు చేరాయి. కొందరు రైతులు అమరావతి కోసం.. నిరసనలతో పాటు.. ర్యాలీలు చేపడుతున్నారు. వారికి సంఘీభావం తెలిపే క్రమంలో చంద్రబాబు మరోసారి హైదరాబాద్ ప్రస్తావన తెచ్చి.. సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఆంధ్రాప్రాంత ప్రజల పాత్రే అధికమని మరో వ్యాఖ్యను చేశారు. ఈ మాట పట్టుకుని.. మళ్లీ తెలంగాణ ప్రజలు కానీ.. అక్కడి ప్రభుత్వం కానీ.. సీమాంధ్రుల విషయంలో ఏమైనా తేడాగా వ్యవహరిస్తే ఎవరిది బాధ్యత.. అన్న ఆలోచన కూడా లేకుండా మాట్లాడేశారు.

హైదరాబాద్ లాంటి రాజధానిని నిర్మించాలని.. ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాల్లో అమరావతిని ఉంచాలన్నది తన కల అని చంద్రబాబు చెబుతుంటారు. ఇదే మాటను.. రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసిన నాటి నుంటి చెబుతూనే వచ్చారు. అయితే అక్కడ ఒక్క శాశ్వత నిర్మాణాన్ని కూడా ప్రారంభించలేకపోయారు. అన్ని గ్రాఫిక్సే. అయినా మహత్తర రాజధాని నిర్మాణం ప్రారంభం అయిందనట్లుగా ఎల్లో మీడియా ఫోకస్ చేసింది.

ఇక్కడి వరకూ అంతా బానే ఉంది. కానీ.. తర్వాత ఏమైంది? రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు.. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు కూడా ఆయన వాదాన్ని తిరస్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అధికారాన్ని అందించారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఎందుకు గుర్తు పెట్టుకోలేకపోతున్నారన్నది ఆయన విజ్ఞతకు.. టీడీపీ పెద్దల విజ్ఞతకు వదిలేద్దాం.

పైగా.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చేసే ప్రయత్నంలో.. చంద్రబాబు తనకు తెలియకుండానే మరో తప్పు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 9 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో.. హైదరాబాద్ పై మాత్రమే దృష్టి పెట్టి.. తెలంగాణలోని ఇతర జిల్లాలను చంద్రబాబు విస్మరించారని అక్కడి టీడీపీ నేతలూ చెబుతారు. ఇప్పుడు కూడా.. అమరావతిపై మాత్రమే దృష్టి పెట్టి.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను అంతగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

2014లో చంద్రబాబు మొదటి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించిన అనంతరం సుదీర్ఘంగా తన అభివృద్ధి ప్రణాళిక వివరించారు. ప్రతి జిల్లాకు ఓ పరిశ్రమ తెస్తానని.. అన్ని జిల్లాల్లోనూ అభివృద్ధి చేసి చూపిస్తానని ఘంటాపథంగా చెప్పారు. చివరికి.. అభివృద్ధి మాట అటుంచితే.. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడు కూడా.. అమరావతిని అభివృద్ధి చేయాలనుకున్నాం.. విశాఖలో పరిశ్రమలు తెద్దామనుకున్నాం.. అంటూ ఆయన పదే పదే చెబుతున్నారు. విశాఖను రాజధానిని చేస్తే ఊరుకునేది లేదనేంతగా ఆవేశపడుతున్నారు. సహజంగానే..ఇతర జిల్లాల్లో ఇలాంటి వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

అందుకే.. చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించాలి. 3 రాజధానుల ప్రతిపాదన రాగానే.. తన పార్టీ నేతలూ స్వాగతించారన్న నిజాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రజల ఆందోళనలు మరింత పెరగకుండా.. వారిని రెచ్చగొట్టి తను రాజకీయ లాభాన్ని పొందాలన్న ఆలోచన చేయకుండా.. కాస్త పారదర్శకంగా వ్యవహరించాలి. చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా.. తన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బతికించుకునే ప్రయత్నం చేయాలి. ఇది.. ఎవరో టీడీపీ వ్యతిరేకులు అంటున్న మాట కాదు.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అశేష సంఖ్యలో ఉన్న టీడీపీ కార్యకర్తల అభిప్రాయమిది.

First Published:  6 Jan 2020 4:29 AM GMT
Next Story