ట్రయిలర్ రివ్యూ: ‘అలా..’ కానిచ్చారు

బన్నీలో ఫుల్ ఎనర్జీ ఉంటుంది. త్రివిక్రమ్ రైటింగ్ లో ఓ రకమైన సెటైర్ ఉంటుంది. ఈ రెండు మిక్స్ చేస్తే మంచి సినిమా తయారవుతుంది. సరిగ్గా అల వైకుంఠపురములో సినిమా ఇలాంటి ఫ్లేవర్ తోనే తెరకెక్కింది. రాత్రి రిలీజైన ఈ ట్రయిలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బన్నీ స్టయిల్, త్రివిక్రమ్ పంచ్ లు ట్రైలర్ లో బాగానే దట్టించారు.

అంతా బాగుంది కానీ, ఎందుకో ఈ ట్రయిలర్ చూస్తున్నంతసేపు త్రివిక్రమ్ పాత సినిమాలు “అలా..అలా” కళ్లముందు కదలాడడం ప్రారంభమయ్యాయి. ఉదాహరణకు ట్రయిలర్ లో బన్నీ ఓ బంగ్లాలోకి వెళ్లే సీన్ చూస్తుంటే అత్తారింటికి దారేది సినిమా గుర్తురాక మానదు. అదే విధంగా ట్రయిలర్ లో బన్నీ చేసిన ఓ ఫైట్ చూస్తుంటే అజ్ఞాతవాసి గుర్తుకురాక మానదు.

ఇక మిడిల్ క్లాస్ అబ్బాయిలా గుమ్మడికాయ పట్టుకోవడం, మురళీశర్మతో సన్నివేశాలు చూస్తుంటే.. అ..ఆ సినిమా ఫ్లేవర్ తగులుతుంది. ఇంకాస్త డీప్ గా వెళ్లి వెదికితే జులాయి, ఖలేజా సీన్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ త్రివిక్రమ్ సినిమాలే కాబట్టి ట్రయిలర్ లో మళ్లీ ఆ ఛాయలు కనిపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ టేకింగ్ మాత్రం మరో అజ్ఞాతవాసి టైపులో ఉంటే మాత్రం కాస్త ఇబ్బందే.

ఈ సంగతి పక్కనపెడితే ట్రయిలర్ మాత్రం చాలా రిచ్ గా ఉంది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. ట్రయిలర్ మొత్తం కాస్ట్ లీ సూట్లు, రిచ్ సెట్లు కనిపిస్తున్నాయి. కలర్ ఫుల్ ఫ్రేమ్స్ తో పాటు కామెడీ కూడా క్లిక్ అయితే ఈ సంక్రాంతి సినిమా ఇదే అవుతుంది. కొసమెరుపు ఏంటంటే.. తన బెస్ట్ ఫ్రెండ్ సునీల్ కు మాత్రం ట్రయిలర్ లో పెద్ద స్కోప్ ఇవ్వలేదు త్రివిక్రమ్. కనీసం సినిమాలోనైనా స్కోప్ ఇచ్చాడని ఆశిద్దాం.