రష్మిక చేతిలో ఒకే ఒక్క సినిమా

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్లు ఎవరంటే ఇద్దరంటే ఇద్దరి పేర్లు మాత్రం గుర్తొస్తాయి. వాళ్లలో ఒకరు పూజా హెగ్డే, రెండు రష్మిక. వీళ్లిద్దరికీ ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ఉంది. చేతినిండా సినిమాలున్నది కూడా వీళ్లిద్దరికే. అయితే ఇక్కడే చిన్న షాక్ ఇస్తోంది రష్మిక. భారీ క్రేజ్ పెట్టుకొని కూడా చేతిలో ఒకే ఒక్క సినిమా ఉందని ప్రకటించింది ఈ బ్యూటీ.

అవును.. సరిలేరు నీకెవ్వరు సినిమాను మినహాయిస్తే, రష్మిక చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. మహేష్ మూవీ రిలీజైన తర్వాత ఇక తనకు ఒకే ఒక్క సినిమా మిగులుతుందని స్వయంగా రష్మిక ప్రకటించింది. అదే బన్నీ-సుకుమార్ సినిమా. ప్రస్తుతం దృష్టి మొత్తం ఆ సినిమాపైనే పెట్టానంటోంది రష్మిక. ఫిబ్రవరి నుంచి ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందంటోంది.

ఇంతకీ రష్మిక మరో సినిమా ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అల్లు అర్జున్, సుకుమార్ సినిమా కోసం ఆమె ఎక్కువగా హోం వర్క్ చేయాల్సి ఉంది. మేకోవర్ తో పాటు మాటల్లో కూడా రాయలసీమ యాస చూపించాల్సి ఉంటుంది. పైగా సుక్కూకు ఆమె బల్క్ కాల్షీట్లు ఇచ్చింది. సో.. బన్నీ సినిమా ఓ కొలిక్కి వచ్చేవరకు మరో సినిమా చేయలేదు రష్మిక. అందుకే క్రేజ్ ఉన్నప్పటికీ ఒక్క సినిమాతోనే నెట్టుకొస్తోంది.