బట్టతల వేధించింది… బలవంతంగా ప్రాణం తీసుకునేలా చేసింది

కేవలం 18 ఏళ్ల వయసు.. ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపాటుకు అవకాశం ఎక్కువ. ఆ తొందరపాటుతోనే.. ఘోరాలు జరిగే అవకాశం ఉంది. పూడ్చుకోలేనంత నష్టాన్ని మిగిల్చే అవకాశమూ ఉంది. హైదరాబాద్ పరిధిలోని కొండాపూర్ లో ఇదే జరిగింది. అణుచుకోలేకపోయిన ఆవేశం.. బలవంతంగా ప్రాణం తీసేలా చేసింది.

ఆవేశ్ (పేరు మార్చాం) వయసు 18 ఏళ్లు. తండ్రి మాదాపూర్ లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆవేశ్ కు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. ఆప్యాయంగా చూసుకునే తల్లి.. మంచి భవిష్యత్తును ఇచ్చే తండ్రి.. ప్రేమను పంచే సోదరుడు.. ఇలా ఆవేశ్ జీవితం సాఫీగా సాగిపోతుండగా.. అతనికి సైనస్ సమస్య మొదలైంది. అక్కడితో ఆగకుండా.. జుట్టు రాలడం మొలదైంది. రాను రాను.. ఉన్న జుట్టంతా పోయి బట్టతల మిగలడంతో.. ఆవేశ్ లో ఆవేదన మొదలైంది.

ఈ సమస్యను చాలాసార్లు ఆవేశ్.. తన తల్లిదండ్రుల దగ్గర వ్యక్తం చేశాడు. వారు అతనికి నచ్చజెప్పి.. చదువుకునేలా ప్రోత్సహించారు. కానీ.. బయటికి మామూలుగానే ఉన్న ఆవేశ్ లో.. బట్టతల రోజురోజుకూ ఆవేదన పెంచింది. ఏం చేయాలో తోచని స్థితిలో.. తల్లిదండ్రుల ఊరడింపు మాటలు తనకు ఉపశమనం కలిగించని స్థితిలో.. ఆవేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వాష్ రూమ్ కు వెళ్లి ఎంతకూ బయటకు రాకపోయేసరికి అనుమానం వచ్చిన తల్లి.. భర్తను ఆఫీసు నుంచి రప్పించింది. తలుపు పగలగొట్టి చూసేసరికి.. ఆవేశ్ శరీరం.. నిర్జీవంగా వేలాడుతోంది. ఆ ఇంట..  ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. బట్టతల విషయంలో అతను పడుతున్న బాధకు.. ఎవరూ సరైన పరిష్కారం చూపకపోవడమే ఘటనకు కారణంగా కనిపిస్తోంది.

అందుకే.. పిల్లలు, వారి మానసిక పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించి.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు.. తల్లిదండ్రులు మరింత సమయాన్ని వెచ్చించాల్సిన అవసరాన్ని ఈ ఘటన.. నొక్కి చెబుతోంది.