Telugu Global
NEWS

తిరుమలేశుడి సాక్షిగా కేటీఆర్ వర్సెస్ హరీష్!

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అడుగులు.. కొంత కాలంగా తన తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే వైపు నడుస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయానికి మరింత ఊతం ఇచ్చేలా.. చర్చను మరింత పెంచేలా మరో సందర్భం టీఆర్ఎస్ లో ఏర్పడింది. ఈ మధ్య.. వైకుంఠ ఏకాదశికి కేటీఆర్ కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అదే సమయంలో.. మరో సీనియర్ నాయకుడు.. టీఆర్ఎస్ అగ్ర నేతల్లో ఒకరు అయిన హరీష్ […]

తిరుమలేశుడి సాక్షిగా కేటీఆర్ వర్సెస్ హరీష్!
X

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అడుగులు.. కొంత కాలంగా తన తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే వైపు నడుస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయానికి మరింత ఊతం ఇచ్చేలా.. చర్చను మరింత పెంచేలా మరో సందర్భం టీఆర్ఎస్ లో ఏర్పడింది.

ఈ మధ్య.. వైకుంఠ ఏకాదశికి కేటీఆర్ కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అదే సమయంలో.. మరో సీనియర్ నాయకుడు.. టీఆర్ఎస్ అగ్ర నేతల్లో ఒకరు అయిన హరీష్ రావు కూడా తిరుమల వెళ్లారు.

ఈ సమయంలో.. ఇద్దరికీ తిరుమల అధికారులు కానీ, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కానీ ఇచ్చిన ప్రాధాన్యతలో స్పష్టమైన తేడాను అంతా గమనించారు. కేటీఆర్ విషయంలో.. ఏకంగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రే వచ్చినట్టుగా హడావుడి చేశారు. హరీష్ విషయంలో మాత్రం దర్శన ఏర్పాట్లలోనూ ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయలేదన్న వార్తలు.. తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాదు.. ప్రజల్లోనూ చర్చనీయాంశమయ్యాయి.

అసలు టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే అది కేసీఆర్ ఇష్టం కానీ.. హరీష్ ప్రాధాన్యతను తగ్గించాల్సిన అవసరం ఏంటి? ఓ రకంగా అవమానించాల్సిన అవసరం ఏంటి? అన్న చర్చ మాత్రం జోరందుకుంది.

రాబోయే మున్సిపల్ ఎన్నికల తర్వాత.. ఇలాంటి చర్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉందని.. ఇప్పటికే కేబినెట్ లో ఉన్న దాదాపు మంత్రులు.. కేటీఆర్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. తిరుమలలో తనకు ఎదురైన అనుభవం గురించి హరీష్ రావు.. మాట మాత్రం కూడా స్పందించకపోవడం.. ఆయన అభిమానులను కలవరపరుస్తోంది. హరీష్ ఆలోచన ఎలా ఉంది.. నిజంగానే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే.. టీఆర్ఎస్ ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నేతల్లో ఒకరిగా ఉన్న హరీష్ ఎలా మసులుకుంటారు అన్నది ఎవ్వరికీ అంతుబట్టకుండా ఉంది.

రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి.. కేసీఆర్ మాటే శాసనం.. ఆయన మార్గమే నాకు ఆదర్శం అని పదేపదే చెబుతూ వస్తున్నారు హరీష్. కానీ.. మరీ ఇంతగా తనకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయని అంతా భావిస్తున్నా.. తాను మాత్రం ఎందుకు మౌనాన్ని కొనసాగిస్తున్నారన్నది కూడా.. హాట్ టాపిక్ అవుతోంది. ఏది ఏమైనా.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం కొన్ని విషయాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.

కేసీఆర్ అమలు చేస్తున్న రాజకీయ ఎత్తుగడలు చూస్తే.. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోయింది. టీడీపీ ఎప్పుడో తెలంగాణలో కనుమరుగైంది. ఆ పార్టీ నేతలు.. టీఆర్ఎస్ ప్రభుత్వంలోమంత్రుల స్థాయికి ఎదిగి.. తమ పూర్వాశ్రమాన్ని భూ స్థాపితం చేశారు. ఇటీవల.. సీఎల్పీ టీఆర్ఎస్ లో విలీనం కావడంతో.. కాంగ్రెస్ ఉనికి కూడా రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారుతోంది. మిగిలిన పార్టీల్లో.. బీజేపీకి హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితమైన రాజకీయ బలం.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడంలో తోడ్పడడం లేదు.

ఇక కమ్యూనిస్టు పార్టీల నేతలు ధర్నాలు, ర్యాలీలకు తప్ప.. చెప్పుకోదగ్గ రాజకీయాలు చేసి చాలా కాలమైంది. ఎంఐఎంతో టీఆర్ఎస్ కు ఉన్న రాజకీయ అవగాహనను.. ఇప్పట్లో ఎవరూ చెడగొట్టే అవకాశం కనిపించడం లేదు.

ఈ పరిస్థితుల్లో.. రాజకీయంగా తెలంగాణలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పటికే తన తనయుడు కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేశారు. ఆ క్రమంలోనే.. మున్సిపల్ ఎన్నికల తర్వాత కాకుంటే.. మరో సందర్భంలో అయినా.. కేటీఆర్ ను సీఎం చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో.. కేటీఆర్ కు పోటీగా ఉన్న హరీష్ రావును.. ఇలా ప్రతి సందర్భంలో.. వెనక్కు లాగేసినట్టుగా కనిపిస్తున్న చర్యలు.. సహజంగానే ఆసక్తిని కలిగిస్తున్నాయి. అసలు టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? రానున్న రోజుల్లో ఏం జరగబోతోందన్నది.. చర్చనీయాంశంగా మారింది. ఇందుకు.. తిరుమలలో హరీష్ రావుకు ఎదురైన తాజా అనుభవం.. ప్రధాన ఉదాహరణగా నిలుస్తోంది.

First Published:  7 Jan 2020 6:30 PM GMT
Next Story