ప్రభాస్ టైటిల్ లాక్కున్న శర్వా

జాన్.. ఈ పేరు చెప్పగానే ప్రభాస్ మూవీ కళ్లముందు కదలాడుతుంది. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాకు వర్కింగ్ టైటిల్ ఇదే. క్లాప్ బోర్డ్ మీద కూడా ఇదే పేరు కనిపిస్తుంది. కట్ చేస్తే, ఇప్పుడా టైటిల్ ను దిల్ రాజు వాడేశాడు. తన అప్ కమింగ్ మూవీకి జాను అనే టైటిల్ ఫిక్స్ చేశాడు.

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా దిల్ రాజు బ్యానర్ పై ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో కల్ట్ ప్రేమకథగా పేరుతెచ్చుకున్న 96 సినిమాకు రీమేక్ ఇది. ఈ మూవీకి జాను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు అదే టైటిల్ తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ సినిమాకు ఇక జాన్ అనే టైటిల్ పెట్టరనే విషయం అర్థమైపోయింది.

నిజానికి ప్రభాస్ యూనిట్ కూడా ఎప్పుడూ జాన్ టైటిల్ పెడతామని చెప్పలేదు. దాన్ని కేవలం ఓ వర్కింగ్ టైటిల్ గా మాత్రమే చూసింది. ఇప్పుడు ఆ అవకాశం కూడా ప్రభాస్ కు లేకుండా పోయింది. ఇక శర్వానంద్ జాను సినిమా విషయానికొస్తే, ఈ సినిమాలో భగ్నప్రేమికుడిగా కనిపించబోతున్నాడు శర్వ. అతడి లవర్ గా సమంత కనిపించనుంది.

తమిళ్ లో ఈ పాత్రల్ని విజయ్ సేతుపతి, త్రిష రక్తికట్టించారు. వాళ్లిద్దరి కెమిస్ట్రీ, యాక్టింగ్ అదుర్స్. సినిమా అంత హిట్టవ్వడానికి అదే కారణం. శర్వా-సమంత ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండితే తెలుగులో కూడా ఈ రీమేక్ సూపర్ హిట్ అవ్వడానికి అన్ని అవకాశాలున్నాయి.