Telugu Global
NEWS

అంత టైం లేదు చంద్రబాబు!.

అత్తగారి ఊరు అమరావతి కోసం చిత్తూరు చంద్రబాబు వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. మీడియా కెమెరాల ముందు నవరసాలు పండిస్తున్నారు. అమరావతిలో భార్యభర్తల మధ్య పంచాయితీలు చేస్తున్నారు. జోలి కట్టి అమరావతి కోసం భిక్షమెత్తుతున్నారు. కానీ ఇతర ప్రాంతాలు… చివరకు చంద్రబాబుకు జన్మనిచ్చిన చిత్తూరు  జిల్లా కూడా నాటకాన్ని చూసి లెక్కలేసుకుంటోంది గానీ మద్దతుగా రావడం లేదు. దాంతో ఊపు తగ్గకుండా ఉంటేందుకు ఎమ్మెల్యేల చేత రాజీనామాలకు చంద్రబాబు ఆలోచన చేస్తున్నారంటూ మీడియాలో లీకులొస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే […]

అంత టైం లేదు చంద్రబాబు!.
X

అత్తగారి ఊరు అమరావతి కోసం చిత్తూరు చంద్రబాబు వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. మీడియా కెమెరాల ముందు నవరసాలు పండిస్తున్నారు. అమరావతిలో భార్యభర్తల మధ్య పంచాయితీలు చేస్తున్నారు. జోలి కట్టి అమరావతి కోసం భిక్షమెత్తుతున్నారు. కానీ ఇతర ప్రాంతాలు… చివరకు చంద్రబాబుకు జన్మనిచ్చిన చిత్తూరు జిల్లా కూడా నాటకాన్ని చూసి లెక్కలేసుకుంటోంది గానీ మద్దతుగా రావడం లేదు. దాంతో ఊపు తగ్గకుండా ఉంటేందుకు ఎమ్మెల్యేల చేత రాజీనామాలకు చంద్రబాబు ఆలోచన చేస్తున్నారంటూ మీడియాలో లీకులొస్తున్నాయి.

ఒకవేళ అదే జరిగితే చంద్రబాబు సీన్‌సితారే. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పేశారు. మరికొందరు క్యూలో ఉన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేద్దామంటే మరికొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి జారుకోవడం ఖాయం. విశాఖను పరిపాలన రాజధానిగా గట్టిగా సమర్థిస్తున్న గంటా శ్రీనివాస్‌ అయితే రాజీనామాకు అంగీకరించకపోవచ్చు. ఆయనే కాదు విశాఖకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒకసారి సమావేశం అయి విశాఖను స్వాగతించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను ధిక్కరించి అచ్చెన్నాయుడు లాంటి ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు బలిపీఠం మీద మెడకాయలు పెడుతారా అంటే అనుమానమే.

సరే ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేశారే అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది. స్పీకర్‌ తక్షణమే రాజీనామాలు ఆమోదించవచ్చు. అలా ఆమోదించినా వెంటనే ఎన్నికలైతే రావు. కనీసం నాలుగైదు నెలలు పట్టవచ్చు. అంత వరకు అసలు విశాఖకు సచివాలయం తరలింపు ఆగుతుందా?. జగన్ తీరు చూస్తుంటే ఆగే ప్రశ్నే లేదు. ఇప్పటికే అమరావతిలో టీడీపీ వారు ఎంత గొడవ చేస్తున్నా జగన్‌ మాత్రం ఎక్కడా తొలకడం లేదు. ఈ తీరు చూస్తుంటే… జరగబోయే పరిణామాలతో సంబంధం లేకుండానే జగన్‌ ముందుకెళ్లేందుకు సిద్ధమయ్యారన్నది స్పష్టంగా తెలుస్తోంది.

టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా, వాటిని స్పీకర్ ఆమోదించినా ఉప ఎన్నికలు వచ్చే లోపే విశాఖకు సచివాలయం తరలింపు పూర్తవుతుందన్నది ఖాయం. విశాఖకు సచివాలయం తరలించిన తర్వాతే ఎన్నికలు రావొచ్చు. అప్పుడు ఎన్నికలు వచ్చినా ఫలితం ఉండదు. ఎలాగో సచివాలయం తరలింపు పూర్తయింది కదా అని… ఓటర్లు తమ స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఓటేయవచ్చు. అదే జరిగితే అధికార పార్టీకి అది కలిసి వస్తుంది. పైగా మొన్నటి ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో గెలిచిన పయ్యావుల కేశవ్ లాంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి తిరగబడనూ వచ్చు. కాబట్టి ఉప ఎన్నికల వల్ల చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోవడం తప్ప సాధించేది ఏమీ లేదు.

First Published:  9 Jan 2020 10:11 PM GMT
Next Story