కెమిస్ట్రీ చూపిస్తే బాగుండేదేమో భీష్మ

భీష్మ అనే టైటిల్ పెట్టినప్పుడే అది హీరో పాత్ర పేరు అనే విషయం అర్థమైంది. అదే ఇప్పుడు నిజమైంది. భీష్మ టీజర్ లో నితిన్ పాత్ర పేరు భీష్మ. చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నప్పటికీ ఎప్పటికీ సింగిల్ అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. కానీ ఆ స్టేట్ మెంట్ కు సంబంధించిన రిఫరెన్స్ ను మాత్రం టీజర్ లో చూపించలేకపోయారు.

భీష్మ టీజర్ ను కేవలం నితిన్ ఎలివేషన్స్ కు కొన్ని కామెడీ పంచ్ లకు మాత్రమే వాడుకున్నారు. నిజానికి ఈ టీజర్ నుంచి ఆడియన్స్ ఆశించింది ఇది కాదు. హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మధ్య కెమిస్ట్రీ చూపిస్తారని భావించారు. నిమిషం టీజర్ లో ఈ ఎలిమెంట్ కోసం కేవలం 2-3 ఫ్రేములు మాత్రమే కేటాయించిన వెంకీ కుడుముల మిగతా టైమ్ మొత్తాన్ని పాత్రల పరిచయానికి, కామెడీకి మాత్రం కేటాయించాడు.

ఇలా కాకుండా.. రష్మిక, నితిన్ మధ్య కెమిస్ట్రీని ఫోకస్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసినట్టయితే సినిమాకు మరింత బజ్ వచ్చి ఉండేది. ఆ ప్రయత్నం మాత్రం జరగలేదు. ఈ సంగతి పక్కనపెడితే టీజర్ మాత్రం రిచ్ గా ఉంది. విజువల్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ బాగున్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకుడు. ఫిబ్రవరి 21న థియేటర్లలోకి వస్తున్నాడు భీష్మ.