ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పూజారా సరికొత్త రికార్డు

  • రంజీ ట్రోఫీలో 7, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 13 ద్విశతకాల మొనగాడు

భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా…ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు.

రాజ్ కోట్ వేదికగా కర్నాటకతో జరిగిన రంజీమ్యాచ్ రెండో రోజు ఆటలో పూజారా ద్విశతకాన్ని పూర్తి చేశాడు. పూజారా మొత్తం 340 బాల్స్ ఎదుర్కొని 24 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 248 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

రంజీల్లో 7వ డబుల్…

దేశవాళీ రంజీ క్రికెట్లో చతేశ్వర్ పూజారాకు ఇది 7వ డబుల్ సెంచరీగా కాగా… ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 13వ డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డు నమోదు చేశాడు.

భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధికంగా 12 ద్విశతకాలు సాధించిన తన రికార్డును పూజారా తానే మెరుగుపరచుకోగలిగాడు.
భారత క్రికెట్ గ్రేట్ విజయ్ మర్చెంట్ పేరుతో ఉన్న 11 డబుల్ సెంచరీల రికార్డును 2017 సీజన్లోనే పూజారా అధిగమించడం ద్వారా సరికొత్త రికార్డు సాధించాడు.

రంజీ ట్రోఫీలో 6వేల పరుగుల మైలురాయిని చేరడంతో పాటు అత్యధికంగా 7 డబుల్ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

రంజీల్లో అత్యధికంగా 9 ద్విశతకాలతో పరాస్ డోగ్రా అగ్రస్థానంలో నిలిస్తే… అజయ్ శర్మ, చతేశ్వర్ పూజారా చెరో 7 ద్విశతకాలతో సంయుక్త ద్వితీయస్థానంలో కొనసాగుతున్నారు.