కొత్త ఏడాది… ఓవర్సీస్ లో కొత్త ఆశలు

గతేడాది టాలీవుడ్ కు షాకిచ్చింది ఓవర్సీస్. చాలా సినిమాల్ని యూఎస్ ప్రేక్షకులు తిప్పికొట్టారు. దీంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చాలా సినిమాలు భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఒక దశలో ఓవర్సీస్ ను అర్థం చేసుకోవడం కష్టంగా మారిందంటూ కథనాలు కూడా వచ్చాయి. అలా 2019లో కొరకరాని కొయ్యగా మారిన ఓవర్సీస్.. 2020లో మాత్రం ట్రేడ్ కు అందుబాటులోకి వచ్చింది. ఊహించని విధంగా సంక్రాంతి సినిమాలు రెండూ ఓవర్సీస్ లో క్లిక్ అయ్యాయి.

అల వైకుంఠపురములో సినిమా ప్రీమియర్స్ తోనే ఏకంగా 8లక్షల డాలర్లకు పైగా ఆర్జించింది. పైగా 14 డాలర్ల టిక్కెట్ ధరతోనే ఇది సాధ్యమైంది. సాధారణంగా ప్రీమియర్స్ కు 20 డాలర్లు టిక్కెట్ ఉంటుంది. కానీ ఓవర్సీస్ పై ఈసారి ఆచితూచి అడుగులేసింది బన్నీ టీం. ఎందుకైనా మంచిదని 14 డాలర్లే ఉంచింది. ఈ ఎత్తుగడ బాగా పనిచేసింది.

అటు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా ఊపందుకుంది. ప్రీమియర్స్ లో టిక్కెట్ ధర పెంచినప్పటికీ.. అంటే టిక్కెట్ ను 20 డాలర్లు చేసినప్పటికీ మహేష్ సినిమాను జనం చూశారు. అలా ప్రీమియర్స్ లో ఈ సినిమాకు 7 లక్షల 60వేల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఈ వసూళ్లతో ఓవర్సీస్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ట్రేడ్ కు అసలైన సంక్రాంతి అందించింది.