అంతగా ఇష్టమైతే… విశ్రాంతి తీసుకోవచ్చుగా బాబూ!

అమరావతి చుట్టూనే ఏం చేసినా. రాష్ట్రంలో ఇంకో సమస్యే లేదన్నట్టుగా.. ప్రజలకు మరేదీ సమస్యే కాదనట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలి కనిపిస్తోంది. ఎప్పుడైతే ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చిందో.. ఆ నాటి నుంచి చంద్రబాబు తన విపరీత పోకడలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. జనాన్ని తన వైపు చూసేలా రకరకాల ఎత్తులు, పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు.

ఈ సందర్భంగా.. మనం రాజధాని ప్రాంత రైతుల గురించి.. వారి ఆవేదన గురించి.. ఆవేశం గురించి తక్కువ చేసి మాట్లాడలేం. ఎందుకంటే.. దాదాపు 3 పంటలు పండించగలిగే సామర్థ్యం ఉన్న భూములను వారు.. అమరావతి కోసం ప్రభుత్వానికి ఇచ్చారు. అందుకే.. ఏం జరగబోతోందో అన్న ఆందోళనలో వారు.. రకరకాలుగా నిరసన తెలుపుతున్నారు. వారి ఆందోళన తీర్చే బాధ్యత.. వారిని సంతృప్తిగా ఉంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కూడా ప్రస్తుతం సంబంధం లేని విషయం. కానీ.. ఈ అంశాలను అన్నిటినీ ముడి పెట్టుకుని చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరే.. చర్చనీయాంశంగా మారుతోంది.

తనకు అంతంత రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నేత ఈ స్థాయిలో ప్రవర్తించడం ఏంటని కూడా.. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. 29 గ్రామాలతో పాటు.. వాటి జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఉధృతంగా ఆందోళనలు కనిపిస్తున్న చందంగా.. చంద్రబాబు కూడా ఇలా కేవలం సెలెక్టెడ్ గా ప్రాంతాలు ఎంచుకుని ఆందోళన చేయడం వెనక మతలబు ఏంటనేది జనానికి అంతుబట్టడం లేదు. పైగా.. ఆయన తిరుపతి, నరసారావు పేటల్లో సభలు నిర్వహిస్తే.. నరసారావుపేటలో వచ్చినంత స్పందన తిరుపతిలో కనిపించలేదన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.

దీనికి తోడు.. తాను ఆందోళనలు మొదలుపెట్టిన తర్వాత.. జేఏసీ ఏర్పాటు చేయించడం.. తర్వాత వారికి ఆర్థిక ఆసరా కోసం జోలె పట్టి డబ్బులు సేకరించడం కూడా.. కాస్త సందేహాస్పదంగా కనిపిస్తోంది. ఇంతవరకూ జనం డబ్బులే తీసుకున్నారు కానీ.. తమ తెలుగుదేశం పార్టీ నుంచి రూపాయి కూడా వారి కోసం వెచ్చించలేదే? ఇందులో మతలబు ఏంటో కూడా జనానికి అర్థం కాలేదు.

తాజాగా.. 3 రాజధానులపై రెఫరెండం పెడదామని.. జగన్ మళ్లీ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని సవాల్ విసిరారు చంద్రబాబు. తనకు రాజకీయాల నుంచి అంతగా తప్పుకోవాలని ఆలోచన ఉంటే ఎవరు కాదంటారు చెప్పండి? కానీ.. ఐదేళ్లు పరిపాలించాల్సిందిగా జనం జగన్ కు అధికారం ఇచ్చారు. ఆ దిశగా ఆయన పని చేస్తున్నారు. ఏడాది కాకముందే.. ఇంత అసహనానికి గురవుతూ.. చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు.. ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు.. అన్నది కూడా.. ప్రజలకు అంతుబట్టడం లేదు.

అమరావతి రైతులు మాత్రం.. పూర్తిగా చంద్రబాబు నీడలోకి వెళ్లిపోయారన్నది నిజం. అక్కడి ప్రజల మనోభావాలను తెలుగుదేశం నాయకులు కబ్జా చేస్తున్నారన్నది కూడా అంతకంటే పెద్ద నిజం. ఇది ఎక్కడివరకు వెళ్తుందో.. సామాన్య ప్రజానీకంగా చూడడం తప్ప.. మనం ఏం చేయలేం.