నేడే చూడండి.. మీ అభిమాన చానల్ లో ‘దర్బార్’!

థియేటర్ లో బొమ్మ పడి వారం కూడా కాలేదు. అప్పుడే టీవీలోనా.. అని ఆలోచించకండి. ఈ విషయం వెనక పెద్ద కథే ఉంది. తమిళనాడులోని శరణ్య అనే టీవీ చానల్ వారు చేసిన ఈ ఘన కార్యం.. ఇప్పుడు లీగల్ ఇష్యూగా మారింది. పైరసీ భూతం సినీ పరిశ్రమను ఎంతగా పట్టి పీడిస్తోందో.. అందరకీ తెలిసిందే. అలాంటి పైరసీకి వ్యతిరేకంగా ఉండాల్సిన టీవీ మీడియానే.. అదే పైరసీ కాపీని తమ చానల్ లో ప్రసారం చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి? ఈ సందర్భం ఎదురైతే.. ఎవరికైనా బాధేస్తుంది. ఇప్పుడు దర్బార్ సినిమా కూడా అదే బాధలో ఉంది.

శరణ్య చానల్ వారు.. దర్బార్ తమిళ వెర్షన్ ను ఈ నెల 12న తమ టీవీలో ప్రసారం చేసేశారు. ఈ విషయం చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ దృష్టికి వచ్చింది. వెంటనే నిర్మాతలు ఆ టీవీ పై కేసు వేశారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై.. ఇప్పటివరకూ చానల్ నిర్వాహకులైతే స్పందించలేదు కానీ.. దర్బార్ నిర్మాతల ఆగ్రహం చూస్తుంటే.. వారికి తగిన శిక్ష పడేదాకా వదిలేట్టు కనిపించడంలేదు.

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి వేదికలు వచ్చాక.. కొత్త సినిమాను అధికారికంగా మహా అయితే విడుదలైన నెల లోపే చూసే అవకాశం కలుగుతోంది. అంతసేపు కూడా ఓపిక లేని ఇలాంటివారివల్లే చిత్ర పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లుతోంది. దర్బార్ విషయం బయటపడింది కానీ.. బయటికి రాని ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సినిమా రాగానే పైరసీ బారిన పడడం.. మూవీ రూల్జ్ లాంటి వెబ్ సైట్లు వాటిని ఆన్ లైన్ లో పెట్టేయడం.. మామూలైపోయింది.

మరింత కఠినమైన చట్టాలు.. సినిమా పైరసీ కాకుండా పర్యవేక్షించే ప్రత్యేక పర్యవేక్షక బృందాలు ఏర్పడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు.