జగన్‌ నిర్ణయానికి కేసీఆర్ సూచనలు

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు మంచి ఆలోచన అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రగతిభవన్‌లో సోమవారం జరిగిన కేసీఆర్‌, వైఎస్ జగన్ భేటీలో రాజధానుల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు మంచి ఆలోచన అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

తెలంగాణలోనూ కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పాలన వికేంద్రీకరించామని.. దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని కేసీఆర్ తన అనుభవాన్ని వివరించారు.

ఏపీలో కూడా అభివృద్దిని ఒకేచోట కేంద్రీకరించకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా వికేంద్రీకరణ చేయడం మంచి నిర్ణయమని … ఈ విషయంలో వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

మూడు రాజధానుల ఏర్పాటుపై జరుగుతున్న ఆందోళనలు తాత్కాలికంగా ఉంటాయని… ప్రజలు వాస్తవాలను తెలుసుకున్న తర్వాత ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారని కేసీఆర్ ఈ భేటీలో వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలోనూ వాస్తవ పరిస్థితులను వివరిస్తూ కఠినంగా వ్యవహరించామని… నిజాలు తెలుసుకున్న తర్వాత కార్మికులే వచ్చి విధుల్లో చేరారని.. ఇప్పుడు వారు సంతోషంగా పనిచేసుకుంటున్నారని కేసీఆర్‌ వివరించారు.

ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సమయంలో హుజుర్‌నగర్ ఎన్నికలు జరిగాయని… ప్రజలు టీఆర్ఎస్‌కు 40వేల ఓట్ల మెజారిటీని ఇచ్చారని… కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలు మంచివైనప్పుడు ప్రజలు మద్దతుగా నిలుస్తారని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే అన్ని సమస్యలకు అదే పరిష్కారం అవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.