పవన్ ని దిల్ రాజు ఎక్కువగా ఊహించుకుంటున్నాడా?

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజ్ తాజాగా ఓ హాట్ కామెంట్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు రెమ్యునరేషన్ బాగా పెంచారని.. ఇది తెలుగు సినిమా పరిశ్రమకు అనారోగ్యకరం అంటూ పరోక్ష విమర్శలు చేశారు.

దిల్ రాజు విమర్శల్లో అర్థం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రెండేళ్ల క్రితం వరకూ మహేష్ బాబు, పవన్ కళ్యాన్ లాంటి అగ్ర హీరోలు.. తమ రెమ్యూనరేషన్ గా రూ.25కోట్లు వసూలు చేసేవారట.. ఇప్పుడు అది రెట్టింపు కావడమే దిల్ రాజు అసహనానికి కారణంగా చెబుతున్నారు.

అయితే తప్పని సరి పరిస్థితుల్లో ఈ స్టార్ హీరోల డేట్స్ పొందడానికి దిల్ రాజుతో సహా నిర్మాతలు భారీ పారితోషకాలు.. వారి కోరినంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.

తాజాగా స్టార్ హీరో, సినిమాలు వదిలేసిన పవన్ కళ్యాన్ కోసం దిల్ రాజు ఏకంగా 50 కోట్ల పారితోషకం ఆఫర్ చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు లాభాల్లో వాటా ఇస్తానని.. ‘పింక్’ రిమేక్ లో నటించాలని కోరారని తెలిసింది.

సినిమాలకు దూరమైన పవన్ గత రెండేళ్లలో ఒక్క సినిమా చేయలేదు. దీంతో ఇప్పుడు తీసే సినిమాతో భారీ బిజినెస్ జరగడం ఖాయం. అందుకే దిల్ రాజ్ ఎంత ఇవ్వడానికైనా రెడీ అయ్యాడు. పవన్ ను మళ్లీ తెరపై చూడడానికి అభిమానులు పోటెత్తుతారని అంచనా వేస్తున్నాడు.

పింక్ సినిమా రిమేక్ కాబట్టి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా అంతగా రావు.. తమిళంలో ఈ మూవీ ఆల్ రెడీ విడుదలైంది. దిల్ రాజుకు కేవలం తెలుగు థ్రియేట్రికల్ హక్కులు.. శాటిలైట్ హక్కులు మాత్రమే వస్తాయి. బోనీ కపూర్ కూడా ఈసినిమాలో భాగస్వామి కావడంతో ఆయనకు సగం వాటా వెళ్లనుంది. దీంతో దిల్ రాజుకు ఏమీ మిగిలేలా కనిపించడం లేదు.

అయితే పవన్ కళ్యాన్ సినిమా తీయడమన్నది తన కల అని.. లాభాల గురించి ఆశించడం లేదని దిల్ రాజు తెలిపారు. ఎక్స్ ట్రా ఖర్చులన్నీ తీసేస్తే 20 కోట్లలో సినిమా నిర్మాణ వ్యయం పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే బడ్జెట్ కంటే ఎక్కువవుతున్న హీరోల రెమ్యునరేషన్ పై దిల్ రాజు తన ఆవేదన వెళ్లగక్కినట్టు తెలిసింది.