తెలుగుదేశంలో నాయకత్వ సమస్య? ఎందుకీ అవస్థ?

పార్టీ స్థాపించిన నాటి నుంచి.. ఎన్నడూ లేనంత రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో ఇప్పటికే దాదాపుగా టీడీపీ కనుమరుగై.. చరిత్రలో కలిసిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ పార్టీకి అలాంటి పరిస్థితే రానుందా అని ప్రశ్నిస్తే…. తెలుగుదేశం నేతల నుంచి.. కాదు అన్న సమాధానం అయితే రావడం లేదు. ఇంతలా.. తెలుగుదేశం పరిస్థితి దిగజారడానికి కారణాలు అనేకంగా ఉన్నాయి.

తెలంగాణ ఉద్యమం జరిగి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు మొదలైనప్పుడే టీడీపీ పతనం మొదలైంది. ఎప్పుడైతే తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో.. అప్పుడే టీడీపీకి బ్యాడ్ టైమ్ ప్రారంభమైంది. నానాటికీ పార్టీ పరిస్థితి తీసికట్టుగా తయారై.. ఇప్పుడు ప్రాతినిధ్యమే కరువయ్యే స్థాయికి దిగజారింది. ఈ క్రమంలో.. పార్టీ పతనానికి చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతం ప్రధాన కారణంగా నిలిచింది. చివరికి ఆ పార్టీ తెలంగాణలో అంతరించిపోయింది.

ఇక.. ఆంధ్రప్రదేశ్ వంతు చూస్తే.. 2014లో అధికారం.. తర్వాత అమరావతికే ప్రాధాన్యం.. పోలవరంపై ప్రచారం.. సింగపూర్ తరహ రాజధాని.. ఇలా మాటలు కోటలు దాటిన తీరు.. ఏమీ లేని ఆంధ్రప్రదేశ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినట్టుగా.. పాలన దాదాపుగా నీటి మీద రాతలుగానే జరిగింది. ఇచ్చిన హామీల్లో ఏదీ తీర్చకుండా పోయినా.. అమరావతికి ఇచ్చిన ప్రాధాన్యం మాత్రం.. తెలుగుదేశం ప్రభుత్వంలో స్పష్టంగా కనిపించింది. సహజంగానే.. ఇతర ప్రాంతాల్లో ఆ పార్టీపై వ్యతిరేతక ఏర్పడింది.

ఇది.. 2019 శాసనసభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ఈ పరిస్థితిలో అధినేత చంద్రబాబు వయసు చూస్తే 70 దాటేందుకు దగ్గరగా వచ్చింది. తర్వాత అధినేతగా ప్రచారంలో ఉన్న చినబాబు పరిస్థితి చూస్తే.. ఆరు ట్వీట్ లు.. మూడు ఆందోళనలు మినహా.. చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. పైగా.. మంగళగిరి ఇచ్చిన ఓటమి.. ఆయన్ను ప్రజల్లో తిరగకుండా చేసింది.

చంద్రబాబు వంతు పాయే.. లోకేష్ వంతూ పాయే. ఇంక నాయకులనే వారు.. పార్టీని నడిపించే స్థాయి ఉన్నవాళ్లు.. చంద్రబాబు స్థాయిలో జాతీయంగా ప్రభావితం చేయగలిగిన వాళ్లూ ఎవరూ టీడీపీలో లేకుండా పోయారు. ఈ విషయాన్ని గుర్తించారు కాబట్టే.. చంద్రబాబు అమరావతిని రాజకీయంగా మలుచుకుంటూ.. మళ్లీ ఎన్నికలు కావాలని డిమాండ్ చేస్తున్నారని.. తాను ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంటున్నట్టు పలువురు అంచనా వేస్తున్నారు.

తెలుగుదేశంలో నాయకత్వ సమస్య ఇంతగా ఎన్నడూ రాలేదని.. తమ భవిష్యత్ ఏంటో అర్థం కాకుండా పోతోందని.. దిగువశ్రేణి నాయకత్వం కూడా మథనపడుతోందట. మరి.. ఈ సమస్యను చంద్రబాబు ఎలా తీరుస్తారో చూడాలి.