“అలా” అత్యుత్సాహం చూపిన బన్నీ

అల వైకుంఠపురములో సినిమా వచ్చి నిన్నటితో 4 రోజులు పూర్తయింది. ఈ 4 రోజులకే నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ అయినట్టు ప్రకటించుకున్నాడు అల్లు అర్జున్. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇది కాస్త అత్యుత్సాహమే అవుతుంది. సైరా, సాహో, రంగస్థలం లాంటి సినిమాల్ని కాదని, 4 రోజులకే వాటిని అధిగమిస్తూ.. నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ చేశామని యూనిట్ ప్రకటించడమే నిజంగా తొందరపాటు చర్యే అవుతుంది.

సాధారణంగా కలెక్షన్ల విషయంలో మేకర్స్ నేరుగా జోక్యం చేసుకోరు. ఎంత కలెక్ట్ అయిందనే విషయాన్ని ఫీలర్ల రూపంలోనే వదుల్తుంటారు. తేడా కొడితే తమకు సంబంధం లేదని తప్పించుకోవడం కూడా ఈ మధ్యేమార్గాన్ని అనుసరిస్తుంటారు. రికార్డులు వెల్లడించడంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతుంటారు. కానీ అల వైకుంఠపురములో యూనిట్ మాత్రం ఈ విషయంలో తెరలు తొలగించేసింది. ఏకంగా అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో 7 ఏరియాల్లో తమ సినిమా నాన్-బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసిందని చెప్పుకుంది యూనిట్. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఒక్క ఈస్ట్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో అల వైకుంఠపురం రికార్డులు సృష్టించిందని చెప్పుకున్నారు. మరి మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా పరిస్థితేంటి? ఈ సినిమా కూడా నైజాంలో రికార్డు సృష్టించినట్టు చెప్పుకుంటున్నారు మేకర్స్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఏరియాల్లో లెక్కలు తేడా కొడుతున్నాయి.