Telugu Global
NEWS

బాలయ్యా… ఎక్కడున్నావయ్యా.. త్వరగా అమరావతికి రా..!

అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటంలో.. ఓ ఫేమస్ ఫిగర్ మిస్ అవుతోంది. ఆయన ఎప్పుడు వస్తారు? ఎప్పుడు తొడ కొడతారు? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ.. అదిగో వస్తున్నా.. ఇదిగో వస్తున్నా.. అన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైంది. ఆయన ఎవరో కాదు.. స్వయానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వియ్యంకుడు కమ్ బావమరిది నందమూరి బాలకృష్ణ. వాస్తవానికి ఆయన నిన్ననే (బుధవారం) తన కుటుంబసభ్యులతో కలిసి అమరావతిలో రైతులను కలుస్తారని ప్రకటనలు […]

బాలయ్యా… ఎక్కడున్నావయ్యా.. త్వరగా అమరావతికి రా..!
X

అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటంలో.. ఓ ఫేమస్ ఫిగర్ మిస్ అవుతోంది. ఆయన ఎప్పుడు వస్తారు? ఎప్పుడు తొడ కొడతారు? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ.. అదిగో వస్తున్నా.. ఇదిగో వస్తున్నా.. అన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైంది. ఆయన ఎవరో కాదు.. స్వయానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వియ్యంకుడు కమ్ బావమరిది నందమూరి బాలకృష్ణ.

వాస్తవానికి ఆయన నిన్ననే (బుధవారం) తన కుటుంబసభ్యులతో కలిసి అమరావతిలో రైతులను కలుస్తారని ప్రకటనలు వెలువడ్డాయి. సీన్ కట్ చేస్తే.. బాలకృష్ణ రాలేదు. నారా వారి కుటుంబం మాత్రమే రైతులను కలిసింది. పిండివంటలు పంపిణీ చేసి వారి మనసును తాకే ప్రయత్నం చేసింది. అక్కడ కూడా ఇదే చర్చ. బాలకృష్ణ వస్తానన్నారు కదా.. ఎందుకు రాలేదు? అసలు వస్తారా? రారా? అని ఒకటే ప్రశ్నలు.

ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలైతే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ముందు రోజు ఎందుకు లీకులు ఇచ్చారయ్యా అంటే.. స్పందించిన నేత కూడా లేడు. అసలెందుకు ఇలా జరిగిందని ఆరా తీసిన వారికి కూడా ఎలాంటి సమాధానం దొరకలేదు. ఇప్పటికే బాలయ్య హిందూపురంలో కష్టాలు ఎదుర్కొంటున్నారు. నిజానికి గడచిన శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల్లో బాలయ్య కూడా ఒకరు.

కానీ.. రాను రాను బాలకృష్ణ పూర్తిగా సైలెంట్ అయ్యారు. సినిమాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. రాయలసీమ ప్రాంతం నుంచి 3 రాజధానుల ప్రతిపాదనకు అంతగా వ్యతిరేకత రాకపోవడంతోనే.. బాలయ్య సైలెంట్ గా ఉంటున్నట్టు ఓ టాక్ నడుస్తోంది. ఇంకో మాట ఏంటంటే.. చంద్రబాబే బాలకృష్ణను మౌనంగా ఉంటే మంచిదని సలహా ఇచ్చారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రచారాల్లో నిజమెంతో, అబద్ధమెంతో బాలయ్యకే ఎరుక. కానీ.. ఎన్టీఆర్ తనయుడిగా.. చంద్రబాబు వియ్యంకుడిగా, బావమరిదిగా మల్టీ టాస్కింగ్ బంధుత్వాన్ని మోస్తున్న బాలయ్య బాబు.. టీడీపీకి కీలకమైన ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడం మంచిది కాదన్న మాట.. ఆ పార్టీ కేడర్ లో వినిపిస్తోంది. అందుకే.. బాలయ్యా.. త్వరగా అమరావతికి రా.. అన్న ఆకాంక్ష వ్యక్తమవుతోంది.

First Published:  15 Jan 2020 9:48 PM GMT
Next Story