అమ్మాయే అనుకుని పెళ్లి చేసుకున్నాడు… తర్వాత మగాడని తెలిసింది!

బురఖాలో ఉన్న అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పేసింది. పెళ్లికి చకచకా పనులన్నీ అయిపోయాయి. జాంజాం అంటూ సంబరంగా పెళ్లి కూడా జరిగిపోయింది. ఆ తర్వాతే ఆ లవర్ బాయ్ కు అసలు విషయం తెలిసింది. ఆనాడు బురఖాలో ఉన్నది అమ్మాయి కాదని.. తాను పెళ్లి చేసుకున్నది తనలాంటి అబ్బాయినే అని. కామెడీ కథలాంటి ఈ నిజం జరిగింది మన దగ్గర కాదులెండి. ‘ఉగాండా’ అనే దేశంలో.

మహ్మద్ ముతుంబా అనే వ్యక్తి ఉగాండాలో ఇమామ్ గా పని చేస్తున్నాడు. ఆయనే ఇలా.. ఓ అబ్బాయిని బురఖాలో చూసి అమ్మాయిగా భావించి పెళ్లి చేసుకుని.. చివరికి ఇబ్బందుల్లో పడ్డాడు. పెళ్లికి ముందు తాము శారీరకంగా కలవలేదని.. పెళ్లి తర్వాత కూడా.. తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి.. పీరియడ్స్ నడుస్తున్నాయని చెప్పి దగ్గరికి రానివ్వలేదని.. అదంతా నిజమే అనుకున్నానని ముతుంబా భోరుమన్నాడు మీడియా ముందు.

అంతా సరే కానీ.. ముతుంబా పెళ్లి చేసుకున్న వ్యక్తి అమ్మాయి కాదని.. అబ్బాయే అని ఎలా తేలింది అని డిటెక్టివ్ లెవల్లో మీకు మీరే ప్రశ్నించుకుంటున్నారా? అయితే సమాధానం కూడా తెలుసుకోండి. స్త్రీ రూపంలో ముతుంబాను మోసం చేసిన సదరు వ్యక్తి.. ఓ దొంగ. పెళ్లి తర్వాత.. గోడలు దూకి దొంగతనం చేస్తున్న తీరు చూసి.. అసలు ముతుంబా భార్య అమ్మాయేనా.. అని పొరుగింటివాళ్లకు అనుమానం వచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న అక్కడి మహిళా పోలీసులు కూడా ముతుంబా పెళ్లి చేసుకున్న మగాడిని పిలిపించారు. పరిశీలించి.. మగాడే అని తేల్చారు.

ఆఖరికి తేలింది ఏంటంటే.. తాను డబ్బుల కోసమే ముతుంబాను మోసం చేశానని నిందితుడు అంగీకరించాడు. జైలుపాలయ్యాడు.

అలా.. ముతుంబా భార్యగా అమ్మాయి రూపంలో ఉన్న ఆ వ్యక్తి.. తనను తాను అబ్బాయే అని పోలీసుల ముందు ఒప్పుకొన్నాడు. ఇదంతా జరిగిన తర్వాత.. ముతుంబా ఓ ఆసక్తికర విషయాన్ని అందరితో పంచుకున్నాడు. తనకు అమ్మాయి కుటుంబీకుల నుంచి కట్నం ముట్టే వరకూ శారీరకంగా కలవకూడదని ముందే తనతో ఆ అమ్మాయి అలియాస్ అబ్బాయి.. ఒప్పందం కుదుర్చుకున్నాడని వాపోయాడు.

ఇది తెలుసుకున్నవారంతా.. ముతుంబా.. ఎంత పని జరిగిందబ్బా.. ఏం కాదులే.. అని ఓదార్చుతున్నారట!