నేను ముందే చెప్పాను… ఎవరూ నమ్మలేదు – పవన్ పై కేఏపాల్ సెటైర్లు

చాలా రోజుల తర్వాత ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మళ్లీ ఫేస్ బుక్ లో ప్రత్యక్షమయ్యారు. తాజాగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్యాన్సులు చేస్తే ఏపీకి పెట్టుబడులు వస్తాయా? అని పవన్ కళ్యాణ్ ను కేఏ పాల్ ప్రశ్నించారు. పవన్ నిజస్వరూపం ఇప్పుడే బయటపడిందని పాల్ కామెంట్స్ చేశారు.

మోడీతో అత్యంత దగ్గర సంబంధాలు ఉంటే ప్రత్యేక హోదాను ఎందుకు తీసుకురాలేదని కేఏ పాల్ ప్రశ్నించారు. ప్రజలు పవన్ కళ్యాణ్ ను నమ్మలేదని.. అందుకే పార్టీని, నిన్ను ఓడించారని పవన్ పై కేఏ పాల్ విరుచుకుపడ్డారు.

వైఎస్ కొడుకు ఏపీ సీఎం జగన్ పై నిందలు వేస్తారా? అని పవన్ పై కేఏ పాల్ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధికి సహకరించకుండా కుట్ర పన్నుతారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సీఎం జగన్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

పవన్ కళ్యాణ్ కు అధికారమే ముఖ్యమని కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన పవర్ కోసమే పార్టీ పెట్టారని.. ఈ విషయాన్ని తాను 2019 ఎన్నికలకు ముందే చెప్పినా ఎవరూ నమ్మలేదన్నారు. పవన్ ను చూస్తే విచారంగా ఉందని.. కాపులు కూడా ఆయనకు ఓటు వేయలేదన్నారు.

2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, వామపక్ష పార్టీలకు కలిపి కేవలం 5శాతం మాత్రమే ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని కోరారు. కమ్యూనిస్టులకు హ్యాండిచ్చి బీజేపీ వైపు తిరిగిన పవన్ వైఖరి సరిగా లేదని దుయ్యబట్టారు.