పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్న మేధావులు

పవన్‌ కళ్యాణ్‌ బీజేపీ పంచన చేరడంతో ఆయన మీద ఆశలు పెట్టుకున్న కొందరు సోషల్ మీడియా వేదికగా తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళల్లో ఎక్కువ మంది రచయితలు, మేధావులు కావడం విశేషం.

పవన్‌ కళ్యాణ్‌ గొప్పనటుడు… ఆయనకు సన్నివేశం, డైలాగ్‌ లు రాసిస్తే అవలీలగా నటించే అలవాటు ఉన్నవాడు.

ఇప్పటివరకూ మంచి స్క్రిప్ట్‌లు అందిస్తూ దర్శకుడిగా, నిర్మాతగా చంద్రబాబు ఉన్నా…. ఇప్పుడు అంతకు మించి నాగపూర్‌ వాసులైన గొప్ప దర్శకుడు, నిర్మాత దొరికాడు అంటూ ఒకరు మెసేజ్‌ పెడితే…. మరొకరు ఆయన ఎవరి స్క్రిప్ట్‌తో నటించాడో ప్రజలకు అర్థమైంది. అందుకే ఆయనను అట్టర్‌ ఫ్లాప్‌ చేసి ప్రజలు రెండు నియోజక వర్గాల్లోనూ ఓడించారు. నీ ప్యాకేజీ డ్రామాలు మాకు తెలుసని నిరూపించారు…. అంటూ మరొకరు పోస్ట్‌ పెట్టారు.

మరో మేధావి స్పందిస్తూ…. మన తెలుగు హీరోలు గొప్ప నటులేం కాదు. అయితే వీళ్ళకు బీభత్సమైన అభిమాన గుంపులు ఉన్నాయి. వీళ్ళ అభిమానాన్ని తమ సినిమా వ్యాపారాభివృద్ధికి ముడిసరుకుగా వాడేసుకుంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ అయితే చేగువేరా అభిమానిని అన్నాడు. భగత్‌సింగ్‌ ఆదర్శం అన్నాడు. గుంటూరు శేషేంద్ర శర్మ, శ్రీశ్రీ కవితలను వల్లె వేశాడు. రాజకీయాల్లో ప్రశ్నించడానికే వచ్చానన్నాడు. దాంతో చాలా మంది మేధావులు అతనిని నమ్మారు. కొంతమంది కన్ఫ్యూజన్‌లో పడ్డారు.

అయితే ఇతను ఆడుతున్న ప్రమాదకర రాజకీయ క్రీడలను ఒక కేస్‌ స్టడీగా తీసుకోవాలి. మనం అభిమానించే చేగువీర, శ్రీశ్రీల పేర్లు చెప్పగానే గుడ్డిగా అతన్ని సమర్ధించినందుకు సిగ్గుతో తలవంచుకోవాలి. ఇంకా బుద్ధి రాని వారు వాళ్ళు చెప్పుతో కూడా కొట్టుకోవచ్చు…. అని ఒక మేధావి అయిన డాక్టర్‌ ఫేస్‌బుక్‌లో పోస్టుపెట్టడం విశేషం.

కోతి తోకకు నిప్పు అంటిస్తే అడవంతా అంటిస్తుంది… ఇప్పుడు జనసేనాని మతతత్వాన్ని తన అభిమానుల్లో రాష్ట్రమంతా అంటించడానికి రెడీ అయ్యాడు. ఇన్నాళ్ళూ ఇతగాడిని కొందరు జోకరు అనుకున్నారు… కానీ పదవికోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు…. అని మరొకరు పోస్ట్‌ పెట్టారు.