వైకుంఠపురములో 2 మిలియన్ డాలర్లు

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా ఓవర్సీస్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. అది కూడా వారం కాకుండానే ఈ ఘనత సాధించింది. అవును.. ప్రీమియర్స్ తో కలుపుకొని 6 రోజులకే అల వైకుంఠపరములో సినిమా 20 లక్షల డాలర్లు ఆర్జించింది.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే, ఈ సినిమా 2.5 మిలియన్ డాలర్లు వసూళ్లు చేయడం పక్కా. అయితే ఇది 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుతుందా లేదా అనేది ఓవర్సీస్ లో వాతావరణం, టిక్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కెనడాతో పాటు యూఎస్ లో చాలా ఏరియాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయి. వెదర్ అనుకూలిస్తే మరింత మంది ఈ సినిమా చూసే ఛాన్స్ ఉంది.

మరోవైపు టిక్కెట్ ధరలు కూడా అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రధాన కేంద్రాల్లో టిక్కెట్ ధరలు స్వల్పంగా మాత్రమే తగ్గాయి. అది కూడా తగ్గితే, అప్పుడు ఈ సినిమా 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరే అవకాశం ఉంది. అల వైకుంఠపురములో సినిమాతో చాన్నాళ్ల తర్వాత ఓవర్సీస్ బయ్యర్లు లాభాలు కళ్లజూస్తున్నారు.