అలియాను నేనింకా కలవలేదు

ఆర్-ఆర్-ఆర్ సినిమా సెట్స్ పైకి అలియాభట్ వచ్చిందట. రామ్ చరణ్, అలియా మధ్య ఓ సాంగ్ షూట్ కూడా కంప్లీట్ అయిందట. మొన్నటివరకు ఈ సినిమాకు సంబంధించి వినిపించిన గాసిప్స్ ఇవి. ఎట్టకేలకు వీటిపై హీరో రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు అలియాకు సంబంధించి వచ్చిన వార్తలన్నీ రూమర్లుగా కొట్టిపారేశాడు.

ఇప్పటివరకు అలియాభట్ సెట్స్ పైకే రాలేదంటున్నాడు రామ్ చరణ్. ఆమె రాక కోసం తనతో పాటు యూనిట్ అంతా ఎదురు చూస్తోందని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ సినిమా సెట్స్ పైకి హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ వచ్చిందని, ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేసిందని క్లారిటీ ఇచ్చాడు చరణ్. ఒలీవియా వస్తే, అంతా అలియా భట్ వచ్చిందంటూ కథనాలు ఇచ్చేశారని చెప్పుకొచ్చారు.

అయితే రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు కానీ, ఆ క్లారిటీతో ఇప్పుడు సినిమా విడుదలపై మరిన్ని అనుమానాలు పెరిగిపోయాయి. లెక్కప్రకారం ఈ సినిమా ఈ ఏడాది జులై 30న విడుదల కావాలి. ఇప్పటివరకు అలియా భట్ రాలేదు. సో.. ఆమె రావాలి, ఆ తర్వాత షెడ్యూల్స్ జరగాలి. ఇదంతా ఈ 6 నెలల్లో జరిగే పని కాదంటూ కొత్త పుకార్లు ఊపందుకున్నాయి.