ఆర్ఆర్ఆర్ పై క్లారిటీ ఇచ్చిన సుదీప్

రాజమౌళి తీసిన ఈగ సినిమాలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి సినిమాలో కూడా ఉన్నాడు. దీంతో రాజమౌళి నెక్ట్స్ మూవీ ఆర్ఆర్ఆర్ లో కూడా సుదీప్ ఉన్నాడంటూ పుకార్లు ఊపందుకున్నాయి. అక్కడితో ఆగకుండా.. రేపట్నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో సుదీప్ పాల్గొంటాడంటూ కథనాలు వెల్లువెత్తాయి. దీంతో సుదీప్ రంగంలోకి దిగాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో తను లేననే విషయాన్ని స్పష్టంచేశాడు సుదీప్. ఆ సినిమాపై ఉన్న గౌరవంతో ఇలా క్లారిటీ ఇస్తున్నానని.. ఆర్ఆర్ఆర్ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని, కనీసం ఆ చర్చ కూడా జరగలేదని స్పష్టత ఇచ్చాడు.

నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి స్టార్ కాస్ట్ సెలక్షన్ మొత్తం పూర్తయింది. విదేశీ నటీనటుల ఎంపిక కూడా ముగిసింది. అంతేకాదు సినిమా షూటింగ్ కూడా దాదాపు 60శాతానికి పైగా పూర్తయింది. ఇలాంటి టైమ్ లో సుదీప్ పై ఇలాంటి పుకార్లు రావడం అర్థరహితం. అయినప్పటికీ రాజమౌళిపై ఉన్న గౌరవంతో ఈ పుకారుపై స్పందించాడు సుదీప్.