రెండు సీట్లలోనూ ఓడిపోయి…. రెండు రాష్ట్రాల్లో రాజకీయాలా?

నిజమే. ఇందుకు తగ్గట్టే ఉంది ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన 2 స్థానాల్లోనూ గెలవలేకపోయిన పవన్.. ఇప్పటికీ తీరు మార్చుకోలేదని గతంలో ఆయన సహచరులుగా ఉన్నవాళ్ళు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. ఏదో బయట అంగీకారం కుదిరినట్టుగా పవనూ, నాదెండ్ల తప్ప.. అంతగా పేరు ప్రఖ్యాతులున్న నాయకులు కూడా జనసేనలో లేరు. బలం, బలగం అంతకన్నా లేదు.

మరి ఏం చూసుకుని పవన్ కు ఇంత నమ్మకం? ఏపీలోనే దిక్కు లేనప్పుడు తెలంగాణలోనూ బలపడతామని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఫ్యాన్స్ పరంగా చూస్తే.. ఓ పవర్ స్టార్ గా పవన్ కు అశేష అభిమాన గణం సొంతం. సినిమాలో కాస్త కంటెంట్ ఉన్నా సరే.. ఇప్పుడు పవన్ నటించినా మంచి కలెక్షన్లు సాధ్యం. కానీ.. రాజకీయ నాయకుడిగా ఆయన సామర్థ్యంపై ఉన్న అప నమ్మకమే.. అభిమానులనూ ఆయనకు దూరం చేస్తోంది.

ప్రత్యేక హోదా కోసం మోడీని తిట్టిన ఆ నోటితోనే.. ఇప్పుడు సీఏఏ, ఎన్నార్సీ గురించి మంచి వచనాలు పలుకుతున్నాడు. మోడీ వంటి నాయకుడు దేశానికి అవసరం అన్నట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు చాలా మంచివారు.. అంటూ గతంలో మాట్లాడిన ఆయనే.. ఇప్పుడు తిట్టీ తిట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. ప్రజా సమస్యలపై పోరు బాట అని చెప్పి మధ్యలోనే ఆ పోరాటాన్ని వదిలేస్తాడు.

ఎప్పుడు మీడియా ముందుకు వస్తాడో.. ఎందుకు అంత ఆవేశంగా ప్రవర్తిస్తాడో.. కొందరికి తప్ప.. మిగిలినవారికి ఏనాడూ అర్థం కాలేదు. ఇలాంటి అస్థిరత్వం ఉన్న వ్యక్తి.. రాజకీయ నాయకుడిగా విజయవంతం అవుతాడా.. అన్నదే జనం ప్రశ్న. అది కూడా.. ఒక రాష్ట్రానికే దిక్కు లేదు.. ఇప్పుడు మరో రాష్ట్రంలోనూ బలపడేందుకు తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పడం.. అమాయకత్వం అనుకోవాలా.. మూర్ఖత్వం అనుకోవాలా అన్నదే అర్థం కావడం లేదు.

కానీ.. ఇదేదీ పవన్ కు పట్టింపు లేదు. నిన్న తెలంగాణ గురించి మాట్లాడిన ఆయనే.. తర్వాత మరిచిపోతాడు. కేసీఆర్ నాయకత్వం బాగుంది అంటాడు. పరిపాలన అద్భుతం అంటాడు. ఎందుకంటే.. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఢీ కొనే ధైర్యం చేయలేడు. అందుకే.. ఇప్పట్లో మళ్లీ ఆ ప్రస్తావన తీసుకురాడు. కాబట్టి.. మనం కూడా ఇంతగా ఆలోచించడం ఎందుకు లెండి. లైట్ తీసుకుంటే పోలా… అని జనసేన అభిమానులు అనుకుంటున్నారట.