ప్రపంచ ప్రో-హాకీలీగ్ లో భారత్ బోణీ

  • హాలెండ్ పై 5-2 గోల్స్ తో విజయం

ప్రపంచ ప్రో-హాకీలీగ్ అరంగేట్రాన్ని 5వర్యాంకర్ భారత్ కళ్లు చెదిరే విజయంతో ప్రారంభించింది. టోక్యో ఒలింపిక్స్ కు సన్నాహాలలో భాగంగా జరుగుతున్న ఈటోర్నీ డబుల్ హెడర్ తొలి అంచె పోటీలో భారత్ 5-2 గోల్స్ తో ప్రపంచ 3వ ర్యాంక్ హాలెండ్ జట్టును చిత్తు చేసింది.

భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన పోటీలో పవర్ ఫుల్ డచ్ జట్టుపై భారత్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది. భారత ఆటగాళ్లలో పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ రూపిందర్ పాల్ సింగ్ ఆట 12, 46 నిముషాలలో లభించిన పెనాల్టీకార్నర్లను గోల్స్ గా మలించాడు.

మిగిలిన మూడు గోల్స్ ను గురుజంత్ సింగ్ , కెప్టెన్ మన్ దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ సాధించారు. హాలెండ్ ఆటగాళ్లలో జెన్సన్, జోరియన్ హెర్జ్ బర్గర్ చెరో గోలు నమోదు చేశారు.