Telugu Global
NEWS

చంద్రబాబులా బతకడం కంటే... వైఎస్ లా చనిపోవడం మేలు!

ఆంధ్రప్రదేశ్ కు 3 రాజధానుల ప్రతిపాదనపై.. శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇందులో భాగంగా.. పార్టీలు తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలకు తోడు.. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా.. 3 రాజధానులకు జై కొట్టారు. ఈ క్రమంలో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. తన అధినేత, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి నేతలు అమరావతి విషయంలో చేస్తున్న రాజకీయ వాదన సరికాదన్నారు. […]

చంద్రబాబులా బతకడం కంటే... వైఎస్ లా చనిపోవడం మేలు!
X

ఆంధ్రప్రదేశ్ కు 3 రాజధానుల ప్రతిపాదనపై.. శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇందులో భాగంగా.. పార్టీలు తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలకు తోడు.. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా.. 3 రాజధానులకు జై కొట్టారు. ఈ క్రమంలో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. తన అధినేత, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి నేతలు అమరావతి విషయంలో చేస్తున్న రాజకీయ వాదన సరికాదన్నారు.

రాష్ట్రానికి సరిగ్గా మధ్యలో అమరావతి ఉందని.. అలాంటి ప్రాంతాన్ని తరలిస్తే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి ఇబ్బంది అని చంద్రబాబు, అతని అనుకూల మీడియా మాట్లాడుతున్న తీరుపై.. మంత్రి నాని తీవ్రంగా స్పందించారు. అలా అయితే.. దేశ రాజధాని ఏమైనా దేశంలో మధ్యలో ఉందా? అని లాజిక్ తో ప్రశ్నించారు. చెన్నై, కోల్ కతా లాంటి నగరాలకు చాలా దూరం ఉన్నా.. ఢిల్లీ వరకూ ప్రజలు వెళ్లడం లేదా.. అని నిలదీశారు.

ఇంకో ముఖ్యమైన విషయాన్ని నాని ప్రస్తావించారు. గతంలో ఆంధ్రులు కర్నూలును రాజధానిగా పోగొట్టుకున్నారు.. తర్వాత హైదరాబాద్ ను పోగొట్టుకున్నారు. అయినా అభివృద్ధి ఏమాత్రం ఆగలేదు.. అని నాని చెప్పారు. ఆయా నగరాలతో సంబంధం లేకుండా.. అమరావతితో సంబంధం లేకుండా.. కృష్ణా, గుంటూరు జిల్లాలు ఏనాడో అభివృద్ధి చెందిన వాస్తవాన్ని సభకు గుర్తు చేశారు.

అమరావతి నుంచి రాజధానిని మారిస్తే.. ఈ ప్రాంత అభివృద్ధి ఆగుతుంది అని చేస్తున్న వాదన తప్పు అని నిరూపించేందుకు ఈ ఉదాహరణ చాలన్నారు. అమరావతి ప్రతిపాదన తెచ్చాకే.. కృష్ణా, గుంటూరు అభివృద్ధి చెందాయి అని అనుకుంటే తప్పని నాని చెప్పారు. అమరావతి ప్రతిపాదనతో అనవసరంగా ఇతర ప్రాంతాల్లో రాగద్వేషాలు పెంచారని తెలుగుదేశం నేతలపై ఆరోపించారు.

చంద్రబాబు రాజధాని కోసం జోలె పట్టుకుని అడుక్కోవడం చూస్తున్న ప్రజలు… జీవితమంతా ఎలాంటి పాపాలు చేశాడో… చివరికి ఇలాంటి గతి పట్టింది అని అనుకుంటున్నారని చెప్పారు.

సామాజిక వర్గాల ప్రతిపాదన కూడా.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాలే చేస్తున్నాయని నాని చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటి సంస్థలు.. ఆకాశం ఊడిపడిపోయినట్టుగా.. తల్లకిందులైనట్టుగా వార్తలు రాస్తున్నాయని తప్పుబట్టారు. కమ్మ కులాన్ని బాగు చేసేందుకే అమరావతిని ఏర్పాటు చేశారా? అందుకే ఇలా వార్తలు రాయిస్తున్నారా? అని నాని అన్నారు. రాజధాని తరలింపుతో ఎవరికీ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. తాను కూడా కమ్మ వర్గానికే చెందినవాడినని.. అవసరమైతే ఉత్తరాంధ్రకు వెళ్లి రాజకీయం చేసుకుంటానని చెప్పారు.

ఇప్పటికే కమ్మ కులస్తులకు విశాఖలో రకరకాల వ్యాపారాలు ఉన్నాయని.. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, సినిమా స్టూడియోలు, ఇతర పరిశ్రమలు చాలా ఉన్నాయని.. ఎవరికీ జగన్ ప్రభుత్వం నష్టం చేసేది లేదని తేల్చి చెప్పారు. నిజంగా కమ్మవారికి అన్యాయం చేసే ఉద్దేశమే ఉంటే.. రాజధానిని కడపకో, నెల్లూరుకో తీసుకెళ్లేవారని.. అలా కాకుండా అమరావతికి తోడుగా… కమ్మ వాళ్ళకు ఎక్కువగా ఆస్తులున్న విశాఖను రాజధానిని చేశారని కాబట్టి ఆయనకు కమ్మ వ్యతిరేకత లేదని చెప్పారు.

కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే ఇబ్బంది ఉంది కాబట్టి.. అందుకే వాళ్లు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చెబితే కమ్మవాళ్లంతా పోలీసులతో ఈడిపించుకుంటారని.. రోడ్లపై ధర్నాలు చేస్తారని.. తాము అతిగా నమ్మే వాళ్లలో చంద్రబాబు మొదటి వారని ఎద్దేవా చేశారు.

అమరావతిని తామూ రాజధానిగా పూర్తిగా తీసి వేయడం లేదని.. ఉత్తరాంధ్ర, రాయలసీమను అభివృద్ధి చేసేందుకే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చామని మరోమారు స్పష్టం చేశారు. ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టే.. ఎన్నికల్లో జగన్ ను గెలిపించారని.. రెచ్చగొడితే వాళ్లు రెచ్చిపోరని నాని అన్నారు.

అసలు లక్షన్నర కోట్ల రూపాయలు మనకు మనమే ఖర్చు పెట్టి.. అమరావతిని ఎలా నిర్మించగలమని ప్రశ్నించారు. గతంలో పిట్టల దొరలు వచ్చి.. ఇలాంటి మాటలు మాట్లాడేవారని.. చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు చెప్పిన విజన్ 2020ని తనదైన శైలిలో చీల్చి చెండాడారు.. కొడాలి నాని. టీడీపీకి ప్రజలు 23 మంది ఎమ్మెల్యేలను ఇస్తే.. ఇద్దరు చంద్రబాబును వదిలి వెళ్లిపోయారని.. బాబు గారు తప్ప మిగిలింది 20 మందేనని.. ఇవాళ అనుకోకుండా 20వ తేదీ అని.. చంద్రబాబు చెప్పే విజన్ 2020 అంటే ఇదే అని నాని అనడంతో.. సభలో నవ్వులు విరిశాయి.

అలాగే.. 2050 నాటికి అమరావతిని ప్రపంచ అగ్రశ్రేణి నగరంగా చేస్తామని చంద్రబాబు గతంలో చేసిన ప్రసంగాలను ప్రస్తావించిన నాని.. ఆ సమయానికి మనకు వందేళ్లు దాటిపోతాయని.. తర్వాత ముఖ్యమంత్రులు కూడా ఏం చేయాలో చెప్పేందుకు చంద్రబాబు ఎవరని అన్నట్టుగా నాని ప్రశ్నించారు.

అమరావతిలోనే రాజధాని ఉండాలని ప్రజలు భావిస్తున్నారని భావిస్తే.. ముందుగా తెలుగుదేశానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 151 మంది ఎమ్మెల్యేలం ఉన్న తాము రాజీనామా చేయడం కాదని అన్నారు. నిజంగా ప్రజలపై.. తెలుగుదేశం చేస్తున్న వాదనపై నమ్మకం ఉంటే.. రాజీనామా చేయాల్సింది టీడీపీ వాళ్ళే అన్నారు. తమను రాజీనామా చేయాలనడం సరికాదన్నారు. తమకు రాజీనామాలు కొత్త కాదని చెప్పారు.

సామాజిక మాధ్యమాల్లో, తమ అనుకూల మీడియాలో టీడీపీ నేతలు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని నాని ఆగ్రహించారు. తనకు గనక వైఎస్ లాంటి మరణం ఎదురైతే.. ఆనందిస్తానని చెప్పారు. బలమైన పార్టీని ఎన్టీఆర్ చేతుల్లోంచి తీసుకుని.. 70 ఏళ్ల వయసు వచ్చిన చంద్రబాబు.. కనీసం తన కుమారుడిని ఎన్నికల్లో గెలిపించుకోలేకపోయారని అన్నారు. అలాంటి బతుకు కంటే.. వైఎస్ లా చనిపోయి.. జగన్ లా తన పిల్లలు ఉన్నతులుగా ఎదిగితే సంతోషిస్తానని వ్యాఖ్యానించారు.

రైతులు చంద్రబాబు మాటలకు మోసపోవద్దని.. ఏ సమస్య ఉన్నా సీఎం జగన్ తో మాట్లాడాలని పిలుపునిచ్చారు. నక్కజిత్తుల రాజకీయాలు చేసే వారిని నమ్మవద్దని.. మూడు ప్రాంతాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండేందుకు అంతా కలిసి ఉండాలని రాష్ట్ర ప్రజలను కోరారు. మూడు రాజధానుల ప్రతిపాదన చేసినందుకు సీఎం జగన్ ను మరోసారి కొడాలి నానిని అభినందించారు.

First Published:  20 Jan 2020 7:06 AM GMT
Next Story